Mammootty: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై అప్ డేట్

Mammootty Health Update Brother Confirms Recovery
  • అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి
  • కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న మమ్ముట్టి
  • ఆయన పునరాగమనాన్ని కోరుతూ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్టులు
  • సోదరుడు ఇబ్రహీంకుట్టి భావోద్వేగ ఫేస్‌బుక్ పోస్ట్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై గత కొద్దికాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారని ఆయన సోదరుడు ఇబ్రహీంకుట్టి అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో ఆయన అభిమానులు, చిత్ర పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

కొంతకాలంగా మమ్ముట్టి అనారోగ్య కారణాలతో నటనకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం అనూహ్యంగా సూపర్ స్టార్ మోహన్‌లాల్, ఎంపీ జాన్ బ్రిట్టాస్ సహా పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అభిమానుల్లో ఆందోళన రెట్టింపయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ తీవ్రమైన చర్చ మొదలైంది. ఈ గందరగోళానికి తెరదించుతూ, ఆయన సోదరుడు ఇబ్రహీంకుట్టి ఫేస్‌బుక్‌ వేదికగా ఒక భావోద్వేగ పోస్టుతో స్పష్టతనిచ్చారు.

"కారుమబ్బులు కమ్మిన కల్లోల సముద్రాన్ని దాటిన నావలా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను. మనసును తొలిచేస్తున్న ఆందోళనలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు పునరాగమన సమయం ఆసన్నమైంది," అంటూ ఇబ్రహీంకుట్టి తన పోస్టును ప్రారంభించారు.

"గత కొంతకాలంగా నేను ఎక్కడికి వెళ్లినా, అందరూ మా ఇచక్క (మమ్ముట్టి ముద్దుపేరు) గురించే అడిగేవారు. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, వీధుల్లో.. ఎక్కడ చూసినా ప్రజలు ప్రేమగా పలకరించి ‘మమ్ముక్క బాగున్నారా?’ అని అడిగేవారు. ‘ఆయన బాగున్నారు’ అని నేను చెప్పగానే వారి ముఖాల్లో వెల్లివిరిసే ఆనందం చూసి ఆశ్చర్యపోయేవాడిని. ప్రపంచమంతా ఒక వ్యక్తి కోసం ఇంతలా ప్రార్థిస్తుందా? అవును, నేను చూసిన ప్రపంచం ఇచక్క కోసం ప్రార్థించింది. పరిస్థితి మరీ ప్రమాదకరంగా లేకపోయినా, నా గుండెల్లో ఏదో తెలియని భారం ఉండేది. కోట్లాది మందితో పాటు నా ప్రతి శ్వాసలోనూ ప్రార్థన కొనసాగింది. ఇప్పుడు ఆ కష్ట కాలాన్ని దాటడంతో సముద్రాన్ని ఈదినంత భావన కలుగుతోంది" అని ఆయన ఉద్వేగభరితంగా రాసుకొచ్చారు.

ఈ కష్ట సమయంలో అండగా నిలిచి, తమ సోదరుడి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఇబ్రహీంకుట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ఇచక్కపై నిస్వార్థమైన ప్రేమను కురిపించిన వారికి, ప్రార్థనలు చేసిన వారికి, ఆయన తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్కరికీ, ఆ దేవుడికి నా ధన్యవాదాలు" అంటూ తన పోస్టును ముగించారు. ఈ పోస్ట్‌తో మమ్ముట్టి రీఎంట్రీ ఖరారైనట్లేనని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అటు, నటుడు వి.కె. శ్రీరామన్ కూడా స్పందిస్తూ, మమ్ముట్టికి మొదట్లో ఆహారం రుచి తెలియకపోవడం వంటి సమస్యలు వచ్చాయని, కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. 
Mammootty
Mammootty health
Malayalam actor
Mohanlal
Ibrahimkutty
VK Sreeraman
Malayalam cinema
celebrity health
actor recovery
South Indian cinema

More Telugu News