వైసీపీ జెండాలతో తిరుమలకు పాదయాత్ర.. అడ్డుకున్న పోలీసులు

  • లిక్కర్ కేసు నిందితుడు ఎంపీ మిథున్ రెడ్డి ఆరోగ్యం కోసం పాదయాత్ర
  • పీలేరు నుంచి తిరుమలకు బయలుదేరిన 30 మంది వైసీపీ కార్యకర్తలు
  • శ్రీనివాస మంగాపురం వద్ద అడ్డుకున్న పోలీసులు
  • పార్టీ జెండాలకు అనుమతి లేదని స్పష్టం చేయడంతో కార్యకర్తల ధర్నా
  • పది మందికి అనుమతి ఇవ్వగా.. అదనంగా వెళ్లిన ఆరుగురి అరెస్ట్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

వివరాల్లోకి వెళితే... వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో సుమారు 30 మంది కార్యకర్తలు పీలేరు నుంచి పార్టీ జెండాలతో తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, శ్రీనివాస మంగాపురం వద్ద వారిని నిలువరించారు. తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో రాజకీయ పార్టీల జెండాలకు అనుమతి లేదని డీఎస్పీ ప్రసాద్, సీఐ ఇమ్రాన్‌ బాషా వారికి స్పష్టం చేశారు.

దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీవారి మెట్టు మార్గం వద్ద ధర్నాకు దిగారు. ఇరువర్గాల మధ్య చర్చల అనంతరం, కేవలం 10 మందిని మాత్రమే ముందుకు వెళ్లేందుకు పోలీసులు అంగీకరించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి మరో ఆరుగురు కార్యకర్తలు ఆ బృందంతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ విషయాన్ని గమనించిన టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు హైడ్రామా నడిచింది. 


More Telugu News