12 రోజుల ఉత్కంఠకు తెర.. యూపీలో ప్రత్యక్షమైన మిస్సింగ్ మహిళా లాయర్

  • రైలులో అదృశ్యమైన లాయర్ అర్చనా తివారీ ఆచూకీ లభ్యం
  • ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖిరిలో ఆమెను గుర్తించిన పోలీసులు
  • 7 నుంచి కనిపించకుండా పోయిన మహిళా న్యాయవాది
  • విచారణ నిమిత్తం భోపాల్‌కు తరలిస్తున్న రైల్వే పోలీసులు
  • 12 రోజుల పాటు ఆమె ఎక్కడుందనే దానిపై వీడని మిస్టరీ
  • ఈ కేసులో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కూడా విచారించిన అధికారులు
మధ్యప్రదేశ్‌లో 12 రోజుల క్రితం రైలులో ప్రయాణిస్తూ అదృశ్యమైన మహిళా లాయర్ అర్చనా తివారీ కేసులో మిస్టరీ వీడింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖిరిలో సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ పరిణామంతో గత కొన్ని రోజులుగా ఆమె కుటుంబ సభ్యుల్లో, అధికారుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.

ఈ విషయాన్ని భోపాల్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) ఎస్పీ రాహుల్ కుమార్ లోధా ఒక వీడియో సందేశం ద్వారా ధ్రువీకరించారు. మంగళవారం రాత్రి ఆమె ఆచూకీని కనుగొన్నామని తెలిపారు. తమ బృందం ఇప్పటికే లఖింపూర్ ఖిరికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుందని, బుధవారం భోపాల్‌కు తీసుకువస్తామని ఆయన వివరించారు. "ఆగస్టు 7 నుంచి కనిపించకుండా పోయిన అర్చనా తివారీ లఖింపూర్ ఖిరిలో వున్నారు. ఆమెను భోపాల్‌కు తీసుకొచ్చాక విచారణ జరిపి, దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం" అని లోధా స్పష్టం చేశారు.

కట్నీకి చెందిన అర్చనా తివారీ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న తన స్వస్థలానికి వెళ్లేందుకు ఇండోర్-బిలాస్‌పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఆమె కట్నీలో దిగాల్సి ఉన్నా, అక్కడికి చేరుకోలేదు. తర్వాత ఆమె బ్యాగ్ ఉమరియా స్టేషన్‌లో లభించింది. అదే రోజు ఉదయం 10:15 గంటల సమయంలో రైలు భోపాల్ సమీపంలో ఉన్నప్పుడు తన కుటుంబంతో చివరిసారిగా మాట్లాడారు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన జీఆర్‌పీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఆమె భోపాల్‌లోని రాణి కమలాపతి స్టేషన్‌లో కనిపించినట్లు తేలింది. అయితే ఆ తర్వాత ఆమె జాడ తెలియరాలేదు. దర్యాప్తులో భాగంగా ఆమె టికెట్‌ను గ్వాలియర్‌లో పనిచేస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించి అతడిని కూడా విచారించారు. అయితే, అసలు ఆమె కట్నీకి వెళ్లాల్సింది పోయి ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖిరికి ఎలా చేరుకుంది? ఈ 12 రోజుల పాటు ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. భోపాల్‌కు చేరుకున్నాక అర్చనను విచారిస్తే ఈ మిస్టరీకి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


More Telugu News