Mother: వరుడి తల్లికి షాక్.. పెళ్లికూతురు తన కూతురేనని తెలిసి కన్నీళ్లు!

Mother discovers bride is her lost daughter at wedding
  • చైనాలో పెళ్లి వేడుకలో ఊహించని ఘటన
  • పుట్టుమచ్చ ఆధారంగా కోడలిని కూతురిగా గుర్తించిన తల్లి
  • ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డగా నిర్ధారణ
  • వరుడు కూడా దత్తపుత్రుడేనని వెల్లడి
  • రక్త సంబంధం లేకపోవడంతో పెళ్లికి ఆమోదం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉదంతం
సాధారణంగా పెళ్లిళ్లలో బంధుమిత్రుల సందడి, ఆనందం కనిపిస్తాయి. కానీ, చైనాలో జరిగిన ఓ వివాహ వేడుకలో మాత్రం సినిమాను మించిన నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొడుకు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి, ఎన్నో ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కన్న కూతురేనని తెలిసి ఓ మహిళ షాక్ అయ్యింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చైనాలోని సుజౌ నగరంలో 2021లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో, వరుడి తల్లి అనుకోకుండా పెళ్లికూతురి చేతిపై ఉన్న పుట్టుమచ్చను గమనించింది. అది అచ్చం తన చిన్నప్పుడు తప్పిపోయిన కూతురి పుట్టుమచ్చలాగే ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే పెళ్లికూతురి తల్లిదండ్రులను కలిసి, "మీరు మీ అమ్మాయిని దత్తత తీసుకున్నారా?" అని అడిగింది. వారు అవునని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది.

పాప శిశువుగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన తమకు దొరికిందని, అప్పటి నుంచి సొంత బిడ్డలా పెంచుకున్నామని వధువు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో వరుడి తల్లి భావోద్వేగానికి గురై, పెళ్లికూతురే తన కన్న కూతురని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. తాను కూడా తన అసలు తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నానని చెప్పి వధువు కూడా కన్నీటిపర్యంతమైంది. ఏళ్ల తర్వాత కలిసిన ఆ తల్లీకూతుళ్లు ఒకరినొకరు హత్తుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి.

అయితే, కథలో మరో కీలక మలుపు ఉంది. వధూవరులు అన్నాచెల్లెళ్లు అవుతారని అందరూ భావిస్తున్న తరుణంలో, వరుడి తల్లి మరో నిజాన్ని బయటపెట్టింది. తన కూతురు తప్పిపోయిన తర్వాత, తట్టుకోలేక ఓ బాబును దత్తత తీసుకున్నానని, అతడే ఈ వరుడని చెప్పింది. దీంతో వధూవరులకు ఎలాంటి రక్త సంబంధం లేదని తేలడంతో, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగిపోతుందనుకున్న పెళ్లిని, రెట్టింపు సంతోషంతో ఘనంగా జరిపించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. "ఇదేం సినిమా స్టోరీ రా బాబు" అని ఒకరంటే, "ఇది టీవీ సీరియల్ కథను మించిపోయింది" అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడీ విషయం వెలుగులోకి వచ్చి మరోమారు వైరల్ అవుతోంది.
Mother
China wedding
daughter
lost daughter
birthmark
adoption
Suzhou
family reunion
viral story
wedding twist

More Telugu News