ముంబైలో భారీ వర్షం.. ఎయిర్ ఇండియా విమానం సేఫ్ ల్యాండింగ్.. కెప్టెన్‌కు నెటిజన్ల సలాం

  • ముంబైలో భారీ వర్షాల మధ్య విమానం సురక్షిత ల్యాండింగ్
  • పైలట్ నీరజ్ సేథి నైపుణ్యంపై నెటిజన్ల ప్రశంసలు
  • ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • ప్రతికూల వాతావరణంతో 250కి పైగా విమానాలపై ప్రభావం
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఓ పైలట్ చూపిన అసాధారణ నైపుణ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. కుండపోత వర్షం, బలమైన గాలులతో ముంబై నగరం అల్లాడుతున్న వేళ, ఎయిర్ ఇండియా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన కెప్టెన్ నీరజ్ సేథి రియల్ హీరోగా నిలిచారు. ఈ అద్భుతమైన ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట‌ వైరల్‌గా మారింది.

మంగళవారం ముంబై విమానాశ్రయంలో దట్టమైన మేఘాలు, భారీ వర్షం కారణంగా ఎదురుగా ఏమీ కనబడని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కు సిద్ధమైంది. ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన కెప్టెన్ నీరజ్ సేథి, విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా దించారు. విమానంలోని ఓ ప్రయాణికుడు ఈ దృశ్యాన్ని వీడియో తీసి, "భారీ వర్షంలో సురక్షితంగా ల్యాండ్ చేసిన కెప్టెన్ నీరజ్ సేథికి హ్యాట్సాఫ్" అనే క్యాప్షన్‌తో ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కెప్టెన్ నీరజ్ సేథిని ప్రశంసలతో ముంచెత్తారు. "ఆకాశంలో నిజమైన హీరోలు వీరే" అని ఒకరు వ్యాఖ్యానించగా, "ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చిన పైలట్‌కు ధన్యవాదాలు" అని మరొకరు పేర్కొన్నారు. అయితే, మరికొందరు యూజర్లు ఇది పైలట్ల విధిలో భాగమని, ఇలాంటి ల్యాండింగ్‌లు ఎక్కువగా ఆటో పైలట్ మోడ్‌లోనే జరుగుతాయని అభిప్రాయపడ్డారు.

మరోవైపు, ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఇవాళ‌ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై విమానాశ్రయంలో 250కి పైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. దీంతో ప్రయాణికులు తమ విమాన సమయాలను నిర్ధారించుకున్నాకే ఎయిర్‌పోర్టుకు రావాలని అధికారులు సూచించారు. వర్షాల వల్ల నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, లోకల్ రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.


More Telugu News