Shruti Haasan: తన తండ్రి కమల్ హాసన్ సినిమా ఫెయిల్యూర్ పై శృతిహాసన్ స్పందన

Shruti Haasan responds to Kamal Haasan movie failure
  • బాక్సాఫీస్ లెక్కలు తన తండ్రిని ప్రభావితం చేయలేవన్న శృతి
  • సినిమా కోసం సొంత డబ్బు పెట్టే తరం నుంచి నాన్న వచ్చారని వ్యాఖ్య
  • నంబర్ గేమ్ అనేది నవతరం ధనవంతుల సమస్య అంటూ కామెంట్
ఒక సినిమా విజయం, అపజయం తన తండ్రి కమల్ హాసన్‌ను ఏమాత్రం ప్రభావితం చేయలేవని హీరోయిన్ శృతి హాసన్ స్పష్టం చేశారు. బాక్సాఫీస్ వద్ద నడిచే 'నంబర్ గేమ్' అనేది ఆయనకు సంబంధించిన విషయం కాదని, అది నవతరం ధనవంతుల సమస్య అని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి ఆమె నటించిన 'కూలీ' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో, తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో, 'థగ్ లైఫ్' వైఫల్యం మీ నాన్నపై ప్రభావం చూపుతుందా? అని అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ తనదైన శైలిలో బదులిచ్చారు. "పదేళ్ల క్రితం ఈ నంబర్ల గురించి ఎవరూ చర్చించేవారు కాదు. సినిమా కోసం అవసరమైతే సొంత డబ్బును కూడా వెచ్చించే తరం నుంచి నాన్నగారు వచ్చారు. కాబట్టి ఇప్పుడు జనాలు వేసే ఈ కలెక్షన్ల లెక్కలు ఆయన్ని ఏమాత్రం కదిలించలేవు" అని ఆమె వివరించారు.

అనంతరం, మీపై మీ తండ్రి ప్రభావం ఎంతవరకు ఉంటుందని అడగ్గా, శృతి హాసన్ ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. "అవును, ఆయన ప్రభావం నాపై ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆయన నాలోని వెలుగును కప్పి ఉంచే నీడ కాదు, నా జీవితంలో నీడను సృష్టించే సూర్యుడి లాంటి వారు" అని ఆమె పేర్కొన్నారు. తండ్రి గురించి శృతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన తండ్రికి అండగా నిలిచిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
Shruti Haasan
Kamal Haasan
Thug Life
Rajinikanth
Coolie movie
Maniratnam
Tamil cinema
Tollywood
Box office collections
Movie success failure

More Telugu News