Avinash Reddy: వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డే ప్రధాన సూత్రధారి: సుప్రీంకోర్టులో సునీత న్యాయవాది వాదనలు

Avinash Reddy is the main conspirator in Viveka murder case Sunithas lawyer arguments in Supreme Court
  • అవినాశ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ
  • సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు
  • డాక్టర్ సునీత, ఆమె భర్త, సీబీఐ మాజీ అధికారిపై నమోదైన కేసులు కొట్టివేత
  • సాక్ష్యాల ధ్వంసం రుజువైందని, నిందితులకు మరణశిక్ష పడొచ్చని కోర్టుకు తెలిపిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ హత్య వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డే ‘మాస్టర్ మైండ్’ అని వివేకా కుమార్తె డాక్టర్ సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనం ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. అవినాశ్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వాడివేడి వాదనలు జరిగాయి.

విచారణ సందర్భంగా సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తూ.. నిందితులు సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కుట్రలో భాగంగానే డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ మాజీ ఎస్పీ రామ్ సింగ్‌లపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే అసలు సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారని ఆయన వాదించారు.

మరోవైపు, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో సాక్ష్యాల ధ్వంసం జరిగిందని దర్యాప్తులో స్పష్టంగా నిరూపితమైందని తెలిపారు. మొదట గుండెపోటు అని, ఆ తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేసి హత్యను కప్పిపుచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని వివరించారు. ఈ నేరం తీవ్రతను బట్టి నిందితులకు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది అహ్మదీ వాదిస్తూ.. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లి అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరించారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ డాక్టర్ సునీత, ఆమె భర్త, రామ్ సింగ్‌పై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసింది. అనంతరం, ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో కూడా తెలియజేయాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
Avinash Reddy
YS Vivekananda Reddy murder case
Sunitha Narreddy
Supreme Court
CBI investigation
Kadapa MP
Siddharth Luthra
Ram Singh

More Telugu News