Worm In Eye: చూపు మందగించిందని డాక్టర్ దగ్గరికి వెళితే.. కంట్లో పాములాంటి పరాన్నజీవి.. షాకైన వైద్యులు!

Worm In Eye Leaves Indian Man With Blurred Vision US Study Finds
  • పరీక్షలో కంటి లోపల నెమ్మదిగా కదులుతున్న పురుగు గుర్తింపు
  • పచ్చి లేదా సరిగా ఉడకని మాంసం తినడమే కారణమని నిర్ధారణ
  • సాధారణంగా పిల్లులు, కుక్కలలో కనిపించే పరాన్నజీవిగా వెల్లడి
  • అరుదైన ఆపరేషన్ చేసి పురుగును విజయవంతంగా తొలగించిన వైద్యులు
చూపు మందగించిందని ఓ వ్యక్తి కంటి డాక్టర్‌ను సంప్రదించగా, పరీక్షించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అతని కంటి లోపల ఒక పరాన్నజీవి నెమ్మదిగా కదులుతుండటాన్ని గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి ఎదురైన ఈ వింత అనుభవం వైద్య శాస్త్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ ప్రచురించింది.

బాధితుడు కళ్లు మసకబారుతున్నాయని చెప్పడంతో వైద్యులు అతనికి ఫండోస్కోపీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో కంటి వెనుక భాగంలో ఒక పురుగు నెమ్మదిగా కదులుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. పరిశోధనలో దానిని ‘గ్నాథోస్టోమా స్పినిగెరమ్’ అనే పరాన్నజీవిగా గుర్తించారు. సాధారణంగా ఈ రకం పురుగులు పిల్లులు, కుక్కల వంటి జంతువులలో కనిపిస్తాయి. సరిగా ఉడకని చేపలు, కోడి మాంసం, పాములు లేదా కప్పల మాంసం తినడం ద్వారా ఇది మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. బాధితుడు కూడా గతంలో సరిగా ఉడకని మాంసం తిన్నట్లు అంగీకరించాడు.

శరీరంలోకి ప్రవేశించిన ఈ పరాన్నజీవి, రక్త ప్రవాహం ద్వారా కంటికి చేరినట్లు వైద్యులు భావిస్తున్నారు. వెంటనే అతనికి ‘పార్స్ ప్లానా విట్రెక్టమీ (పీపీవీ)’ అనే ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి, కంటిలోని పురుగును విజయవంతంగా తొలగించారు. అనంతరం దానిని మైక్రోస్కోప్ కింద పరీక్షించి గ్నాథోస్టోమాగా నిర్ధారించారు.

అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ నిపుణుడు డాక్టర్ అబ్ధిశ్‌ భవ్సర్ మాట్లాడుతూ.. “ఇలాంటి పరాన్నజీవులు కంటి రెటీనాలోకి చేరితే తీవ్ర నష్టం కలిగిస్తాయి. కొన్నిసార్లు శాశ్వతంగా చూపును కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది” అని హెచ్చరించారు. ఆహార పదార్థాలను, ముఖ్యంగా మాంసాహారాన్ని బాగా ఉడికించి తినడం ద్వారా ఇలాంటి ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Worm In Eye
Gnathostoma spinigerum
Eye parasite
parasitic worm
eye infection
undercooked meat
pars plana vitrectomy
ophthalmology
retina damage
Abdhish Bhavsar
Madhya Pradesh

More Telugu News