తల్లిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమిర్ ఖాన్ సోదరుడు

  • పిన్నిని పెళ్లి చేసుకోమని తల్లి బలవంతం చేసిందని సంచలన వ్యాఖ్యలు
  • కుటుంబంతో అన్ని సంబంధాలు అధికారికంగా తెంచుకుంటున్నట్లు ప్రకటన
  • ఫైసల్ ఆరోపణల్లో వాస్తవం లేదంటూ గతంలోనే స్పందించిన అమీర్ కుటుంబం
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కుటుంబంలో వివాదం మరోసారి భగ్గుమంది. ఆయన సోదరుడు, నటుడు ఫైసల్ ఖాన్ తన కుటుంబంపై, ముఖ్యంగా తల్లి జీనత్ హుస్సేన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 2002-03 సమయంలో తన సొంత పిన్ని (తల్లి సోదరి)ని వివాహం చేసుకోమని తన తల్లి తీవ్రంగా బలవంతం చేసిందని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఇప్పటికే తన కుటుంబంతో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నట్లు ఫైసల్ ఖాన్ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. "చాలా బాధతో, కానీ కొత్త ధైర్యంతో ఈ విషయం పంచుకుంటున్నాను. నా కుటుంబంతో అన్ని బంధాలను తెంచుకున్నాను. నా ఎదుగుదలకు, మానసిక స్వస్థతకు ఈ నిర్ణయం చాలా అవసరం. ఇప్పుడు నా జీవితంలో స్వేచ్ఛ, గౌరవం, ఆత్మశోధనతో కూడిన కొత్త అధ్యాయం మొదలైంది" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ, తన సోదరి నిఖత్ హెగ్డే, బావ సంతోష్ హెగ్డేలే ఆమిర్ ఖాన్‌ను తప్పుదోవ పట్టించారని ఫైసల్ ఆరోపించారు. అయితే, ఆమిర్ చిన్నపిల్లాడేమీ కాదని, ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉందని అన్నారు. ఇటీవల తమ కుటుంబం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, అందులో ఎక్కడా తేదీలు ప్రస్తావించకుండా పాత విషయాలనే కొత్తగా జరిగినట్లు చిత్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు.

గతంలో కూడా ఫైసల్ ఖాన్ తన సోదరుడు ఆమిర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకు స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్య ఉందని ముద్రవేసి, అమీర్ తనను ఏడాది పాటు ఇంట్లో బంధించాడని, ఇష్టం లేకుండానే బలవంతంగా మందులు ఇచ్చారని ఫైసల్ ఆరోపించారు. సమాజానికి ప్రమాదకరంగా మారాడంటూ తన తల్లి, సోదరి తనపై కేసు కూడా పెట్టారని ఆయన గుర్తుచేశారు. అయితే, ఫైసల్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అతను సంఘటనలను వక్రీకరిస్తున్నాడని ఆమిర్ ఖాన్ కుటుంబం గతంలోనే ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా ఆరోపణలతో ఈ కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.


More Telugu News