హెచ్‌సీఏ అక్రమాల్లో కేటీఆర్, కవితలది కీలక పాత్ర: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి

  • హెచ్‌సీఏ అవకతవకల్లో క్విడ్ ప్రోకో జరిగిందన్న గురువారెడ్డి
  • సీఐడీ దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయని వెల్లడి
  • కేటీఆర్ బంధువు రాజ్ పాకాలకు టిక్కెట్ల కాంట్రాక్టు ఇచ్చారని విమర్శ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెచ్‌సీఏ అవకతవకల్లో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆయన అన్నారు. సీఐడీ దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించారు.

అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు నిబంధనలు పాటించాలని బీసీసీఐ చెప్పిందని వెల్లడించారు. కోర్టుల్లో కేసులు వేస్తూ హెచ్‌సీఏ అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. కమిటీలలో మంత్రులు ఉండకూడదని చెప్పినప్పటికీ, బీసీసీఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్ కమిటీలో కేటీఆర్ కొనసాగారని ఆరోపించారు. కేటీఆర్ బంధువు రాజ్ పాకాలకు బీసీసీఐ టిక్కెట్ల కాంట్రాక్టు ఇచ్చారని ఆయన అన్నారు.

పదేళ్ల నుంచి ఒకే ఆడిట్ రిపోర్టును ప్రతిసారి కాపీ పేస్ట్ చేసి, దానిని పాస్ చేస్తూ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం క్లబ్బుల అభివృద్ధికి రూ. 6.10 కోట్లు ఇస్తున్నారని, అయితే టీమ్‌లు లేని క్లబ్బులకు కూడా ఇచ్చారని ఆయన అన్నారు. హెచ్‌సీఏ పరిపాలనా వ్యవహారాలకు కూడా నెలకు రూ. 12 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నెలకు అంత మొత్తంలో ఎలా ఖర్చు చేశారని గురువారెడ్డి ప్రశ్నించారు.


More Telugu News