కొత్త ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి: నిర్మలా సీతారామన్ కు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి లోకేశ్ భేటీ
  • మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
  • ఏపీకి ఆర్థిక సాయంపై కేంద్రానికి కృతజ్ఞతలు
  • రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిపై వివరణ
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహకారానికి లోకేశ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని, ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్మలా సీతారామన్‌కు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తలపెట్టిన కొత్త ప్రాజెక్టులకు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా లోకేశ్ ఆమెను కోరారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. 

నారా లోకేశ్ ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కేంద్రమంత్రులు జై శంకర్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీలను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై కీలక ప్రతిపాదనలు చేశారు. 


More Telugu News