American Vlogger: నులక మంచం, చేతి పంపు.. భారత పల్లెటూరికి అమెరికా కుర్రాడు ఫిదా.. ఇదే బెస్ట్ కంట్రీ అంటూ వీడియో!

US Man Marvin Achi Shares Experience Of Visiting Indian Village Says Best Country
  • భారత గ్రామాన్ని సందర్శించిన టెక్సాస్ కంటెంట్ క్రియేటర్ మార్విన్ అచి
  • పల్లెటూరి జీవనశైలి, ఆహారంపై ప్రశంసల వర్షం
  • తాను చూసిన దేశాల్లోకెల్లా ఇండియా ఉత్తమమైందని వ్యాఖ్య
  • ఇన్‌స్టాగ్రామ్‌లో అత‌ని వీడియోకు 75 లక్షలకు పైగా వ్యూస్
టెక్నాలజీ, హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండే భారతీయ పల్లెటూరి జీవితం ఓ అమెరికన్‌ను అమితంగా ఆకట్టుకుంది. టెక్సాస్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ మార్విన్ అచి ఇటీవల ఓ భారత గ్రామాన్ని సందర్శించి, ఇక్కడి జీవన విధానానికి ముగ్ధుడయ్యాడు. తాను సందర్శించిన దేశాల్లోకెల్లా భారతదేశమే ఉత్తమమైందని, తన జీవితంలో అత్యుత్తమ ఆహారాన్ని ఇక్కడే రుచి చూశానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గ్రామీణ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసే భారతీయ కంటెంట్ క్రియేటర్ శివానితో కలిసి మార్విన్ ఈ పల్లెటూరిలో పర్యటించాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో కలిసిపోయి, వారి జీవనశైలిని అనుభవించాడు. చేతి పంపుతో నీళ్లు కొట్టడం, సాధారణ మంచంపై నిద్రించడం వంటి పల్లెటూరి పనులను ఆస్వాదించాడు. ఇక్కడి ప్రశాంత వాతావరణం, నిరాడంబరత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తన వీడియోల్లో పేర్కొన్నాడు. నగర జీవితానికి, పల్లెటూరి జీవితానికి మధ్య ఉన్న తేడాను, గ్రామీణ ప్రజల ఆప్యాయతను ఆయన తన వీడియోల ద్వారా కళ్లకు కట్టారు.

మార్విన్ అచి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. ఇప్పటివరకు 75 లక్షలకు పైగా వీక్షకులు ఈ వీడియోను చూశారు. భారత గ్రామీణ సంస్కృతిని మనస్ఫూర్తిగా అభినందించిన మార్విన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "మీరు అద్భుతమైన యాత్ర చేశారని భావిస్తున్నాను", "చాలా గొప్ప సమయం గడిపినట్టున్నారు" అంటూ పలువురు కామెంట్లు చేశారు.

ఈ స్పందనతో ఉత్సాహంగా ఉన్న మార్విన్, త్వరలోనే మళ్లీ భారత్‌కు వస్తానని తెలిపారు. "నాకు 10 మిలియన్ల ఫాలోవర్లు వచ్చినప్పుడు మళ్లీ భారత్‌కు తిరిగొస్తాను. ఈసారి ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలను చూడాలనుకుంటున్నాను. ధన్యవాదాలు ఇండియా. త్వరలో కలుద్దాం" అని తన పోస్టులో పేర్కొన్నారు.
American Vlogger
Marvin Achi
Indian village
Rural life India
Indian culture
Village life
India travel
Texas content creator
Shivani
Travel vlogger

More Telugu News