MS Dhoni: ధోనీ ఎప్పటికీ హెడ్ కోచ్ కాలేడు... కారణం ఇదే: ఆకాశ్ చోప్రా

MS Dhoni will never be head coach says Aakash Chopra
  • కోచింగ్ అనేది ఆటగాడి కంటే బిజీగా ఉండే ఉద్యోగమన్న ఆకాశ్ చోప్రా
  • ఏడాదికి 10 నెలలు కుటుంబానికి దూరం కావాలని వ్యాఖ్య
  • ధోనీ ఇప్పుడు ఆ త్యాగానికి సిద్ధంగా లేడని అభిప్రాయం
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై చర్చ జరుగుతున్న వేళ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదని మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. కోచింగ్ అనేది చాలా కఠినమైన బాధ్యత అని, ప్రస్తుతం ధోనీ ప్రాధాన్యతలు అందుకు సరిపోవని ఆయన స్పష్టం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ వ్యాఖ్యలు చేశారు. 

"కోచింగ్ చాలా కష్టమైన ఉద్యోగం. ఆటగాడిగా ఉన్నప్పటి కన్నా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ బిజీగా ఉండాల్సి వస్తుంది. ధోనీ ఇప్పటికే జీవితంలో ఎక్కువ కాలం సూట్‌కేసులతో ప్రయాణిస్తూ గడిపాడు. ఇప్పుడు ఆయనకు ఒక కుటుంబం ఉంది. మళ్లీ అలాంటి జీవితాన్ని గడపాలని ధోనీ కోరుకోడు" అని చోప్రా అభిప్రాయపడ్డారు.

చాలా మంది మాజీ ఆటగాళ్లు కేవలం రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కోచింగ్‌ ఇవ్వడానికి ఇష్టపడతారని, కానీ భారత జట్టుకు కోచ్‌గా ఉండటం పూర్తి భిన్నమైన వ్యవహారమని ఆయన గుర్తుచేశారు. "టీమిండియా హెడ్ కోచ్‌గా ఉంటే ఏడాదికి దాదాపు 10 నెలలు జట్టుతోనే గడపాలి. అంత సమయం కేటాయించడం చాలా కష్టం. ఒకవేళ ధోనీ అంత సమయం కేటాయించగలిగితే నేను ఆశ్చర్యపోతాను" అని ఆకాశ్ చోప్రా అన్నారు. ఈ కారణాల వల్లే ధోనీ హెడ్ కోచ్ రేసులో ఉండే అవకాశం లేదని ఆయన తన విశ్లేషణలో పేర్కొన్నారు. 
MS Dhoni
Mahendra Singh Dhoni
Aakash Chopra
Team India head coach
Indian Cricket Team
Cricket coaching
IPL coaching
Cricket commentator
Dhoni coach
Indian cricket

More Telugu News