ఖజానా జ్యుయెలర్స్ దోపిడీ... పోలీసుల అదుపులో బీహార్ గ్యాంగ్!

  • ఇటీవల చందానగర్ లోని ఖజానా జ్యూవెలరీలో భారీ దోపిడీ
  • పది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
  • ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో ఇటీవల జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీలో కీలక నిందితులైన ఇద్దరిని మాదాపూర్ పోలీసులు పూణేలో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి నాటు తుపాకులు, బుల్లెట్లు, గోల్డ్ ప్లేటెడ్, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

**కేసు వివరాల్లోకి వెళితే..**

ఖజానా జ్యువెలరీ దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠాలో కీలకంగా వ్యవహరించిన దీపక్, ఆశిష్‌లను మహారాష్ట్రలోని పూణేలో అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురు ఈ దోపిడీకి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. నిందితులంతా బీహార్‌కు చెందిన సివాన్ గ్యాంగ్, సారక్ గ్యాంగ్‌లకు చెందినవారిగా గుర్తించారు.

**వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి దోపిడీ**

దోపిడీకి ఇరవై రోజుల ముందు నుంచే ఈ ముఠా హైదరాబాద్‌కు వచ్చి రెక్కీ ప్రారంభించింది. నగరంలోని పది జ్యువెలరీ షాపులపై వీరు రెక్కీ నిర్వహించారు. ఖజానాలో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను లక్ష్యంగా చేసుకుని, ప్రత్యేక రూట్ మ్యాప్ రూపొందించారు. హైదరాబాద్ నుంచి బీదర్ వరకూ ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ రెక్కీ చేశారు. పోలీసులకు పట్టిపడకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లు వాడొద్దని నిబంధన విధించుకుని, అన్ని చర్యలు వ్యూహాత్మకంగా అమలు చేశారు. దోపిడీ అనంతరం దొంగిలించిన ఆభరణాలను నాలుగు భాగాలుగా విభజించి, ముఠా సభ్యులు తలో దిక్కుగా పారిపోయారు.

**దోపిడీ జరిగింది ఇలా...**

ఆగస్టు 12న సాయంత్రం బైకులపై వచ్చిన ఏడుగురు దుండగులు, భద్రతా సిబ్బంది తక్కువగా ఉన్న సమయంలో జ్యువెలరీ షాపులోకి చొరబడ్డారు. సిబ్బందిని నాటు తుపాకులతో బెదిరించగా, తాళాలు ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు, ఆయన కాలికి గాయమైంది. అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, పోలీసులు రాకముందే సుమారు 10 కిలోల వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. నకిలీ నంబర్ ప్లేట్ల బైకులపై వీరు పరారయ్యారు. నిందితులు మొబైల్ వాడకపోవడం, నంబర్ ప్లేట్లు మార్చడం వల్ల వారిని వెంటనే గుర్తించడం పోలీసులకు కష్టతరమైంది.

**దర్యాప్తు వేగవంతం**

ఈ కేసును ఛేదించేందుకు 10 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. దీపక్, ఆశిష్‌లను పూణేలో అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నాటు తుపాకులు, బుల్లెట్లు, గోల్డ్ ప్లేటెడ్ వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అరెస్ట్ అయిన నిందితులకు గతంలో కోల్‌కతా, బీహార్, కర్ణాటకలో కూడా దోపిడీలకు పాల్పడిన చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముఠాకు హైదరాబాద్‌లో ఇది మొదటి దోపిడీగా తెలుస్తోంది. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు.

ఈ సందర్భంగా డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తులను ఉద్యోగాల్లో తీసుకునేటప్పుడు వారి నేపథ్యాన్ని పరిశీలించాల్సిన అవసరం యజమానులకు ఉందన్నారు. ఇలా అపరిచితులను పని మీద ఉంచే ముందు వారి వివరాలను తీసుకోవాలని హెచ్చరించారు. 


More Telugu News