ట్రంప్-పుతిన్ భేటీపై భారత్ హర్షం

  • అలస్కాలో జరిగిన ట్రంప్-పుతిన్ భేటీని స్వాగతించిన భారత్
  • శాంతి కోసం ఇరు దేశాధినేతల చొరవ అభినందనీయం అని వెల్లడి
  • ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలకాలని పిలుపు
ప్రపంచ శాంతి స్థాపన దిశగా అమెరికా, రష్యా అధ్యక్షులు తీసుకున్న చొరవను భారత్ మనస్ఫూర్తిగా స్వాగతించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరు దేశాధినేతల నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ, ఈ చర్చలు సానుకూల వాతావరణానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇందుకు చర్చలు, దౌత్యపరమైన మార్గాలే అత్యంత కీలకమని పునరుద్ఘాటించింది. అలస్కా సమావేశంలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతిని భారత్ అభినందిస్తున్నట్లు పేర్కొంది.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద శక్తుల మధ్య సంప్రదింపులు జరగడం అంతర్జాతీయంగా శాంతియుత వాతావరణాన్ని బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఎలాంటి సమస్యనైనా సామరస్యపూర్వక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చనే విధానానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసింది. 


More Telugu News