Irfan Pathan: అఫ్రిదికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పఠాన్.. ఆ ఒక్క మాటతో నోరు బంద్!

Irfan Pathan Reveals How He Dealt with Shahid Afridis Taunts
  • 2006 పాక్ పర్యటనలో జరిగిన ఓ ఘటనను తాజాగా బయటపెట్టిన పఠాన్
  • విమానంలో తనను అఫ్రిది రెచ్చగొట్టాడని, చిన్నపిల్లాడివంటూ ఎగతాళి చేశాడని వెల్లడి
  • "కుక్క మాంసం తిన్నాడేమో" అంటూ ఘాటు వ్యాఖ్యతో అఫ్రిదికి బదులిచ్చిన వైనం
  • ఆ ఒక్క మాటతో అఫ్రిది పూర్తిగా సైలెంట్ అయ్యాడన్న పఠాన్
  • అప్పటి నుంచి అఫ్రిది తనతో మాటల యుద్ధానికి దిగలేదని స్పష్టీకరణ 
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిల మధ్య మైదానంలోనే కాదు, బయట కూడా తీవ్రమైన పోటీ ఉండేది. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో తనను మాటలతో రెచ్చగొట్టిన అఫ్రిది నోరు.. ఒకే ఒక్క వ్యాఖ్యతో మూయించానని పఠాన్ తాజాగా వెల్లడించాడు. 2006లో జరిగిన ఓ విమాన ప్రయాణంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఓ ఇంటర్వ్యూలో పఠాన్ మాట్లాడుతూ.. "2006లో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా కరాచీ నుంచి లాహోర్‌కు ఇరు జట్ల సభ్యులం ఒకే విమానంలో ప్రయాణిస్తున్నాం. ఆ సమయంలో అఫ్రిది నా దగ్గరకు వచ్చి, తలపై చేయి వేసి నా జుట్టు చెదరగొట్టాడు. 'ఏంటి పిల్లాడా.. ఎలా ఉన్నావ్?' అంటూ నన్ను ఎగతాళి చేశాడు. అతని ప్రవర్తన నాకు చాలా చిరాకు తెప్పించింది" అని గుర్తుచేసుకున్నాడు.

ఆ తర్వాత కూడా అఫ్రిది తనను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడని పఠాన్ తెలిపాడు. "నా పక్కనే పాక్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ కూర్చుని ఉన్నాడు. అప్పుడు నేను కావాలనే బిగ్గరగా, 'ఇక్కడ ఎలాంటి మాంసం దొరుకుతుంది?' అని రజాక్‌ను అడిగాను. అతను రకరకాల జంతువుల మాంసం దొరుకుతుందని చెప్పాడు. వెంటనే నేను 'మరి కుక్క మాంసం దొరుకుతుందా?' అని ప్రశ్నించాను" అని పఠాన్ వివరించాడు.

"నా ప్రశ్నతో రజాక్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు నేను అఫ్రిది వైపు చూస్తూ, 'అతను (అఫ్రిది) కుక్క మాంసం తిన్నట్లున్నాడు, అందుకే అంతగా అరుస్తున్నాడు' అని అన్నాను. ఆ వ్యాఖ్యతో అఫ్రిది ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. మళ్లీ ఏమైనా అంటే 'చూడు ఇంకా అరుస్తున్నాడు' అంటానేమోనని భయపడ్డాడు. ఆ రోజు నుంచి మళ్లీ ఎప్పుడూ నాతో మాటలతో గొడవకు దిగలేదు" అని ఇర్ఫాన్ పఠాన్ ఆనాటి ఘటనను తెలిపాడు. 
Irfan Pathan
Shahid Afridi
India vs Pakistan
Abdul Razzaq
Cricket rivalry
Pakistan tour 2006
Cricket banter
Indian cricketer
Pakistani cricketer
Cricket news

More Telugu News