సల్మాన్‌ఖాన్, షారూఖ్‌ఖాన్ ల నకిలీ ఆటోగ్రాఫ్‌లు విక్రయించి రూ. 3200 సంపాదించిన యూట్యూబర్.. వీడియో ఇదిగో!

  • ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌తో నకిలీ ఆటోగ్రాఫ్‌లు తయారుచేయించిన యూట్యూబర్ సార్తక్ సచ్‌దేవా
  • రోడ్డు పక్కన వాటిని విక్రయించిన వైనం
  • పిల్లల నుంచి పెద్దల వరకు కొనుగోలు
  • గతంలోనూ వార్తల్లో నిలిచిన సచ్‌దేవా
బాలీవుడ్ సెలబ్రిటీల నకిలీ ఆటోగ్రాఫ్‌లను రోడ్డు పక్కన అమ్ముతూ ఓ యూట్యూబర్ ఒక్క రోజులో రూ. 3,200 సంపాదించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సార్తక్ సచ్‌దేవా ఈ ప్రయోగాన్ని చేసి ప్రజలను ఆశ్చర్యపరిచాడు. సార్తక్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. 

"సెలబ్రిటీల ఆటోగ్రాఫ్‌లను అమ్మి ఎంత సంపాదించవచ్చో చూద్దామని ఈ పని చేశాను" అని ఆయన చెప్పాడు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి ప్రముఖుల ఆటోగ్రాఫ్‌లను ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌తో రాయించి, వాటిని ఒక్కొక్కటి రూ. 100 చొప్పున విక్రయానికి పెట్టాడు.

మొదట్లో ప్రజలు వీటిని కొనేందుకు కాస్త వెనుకాడినా, క్రమంగా ఆకర్షితులయ్యారు. మొదటి నకిలీ ఆటోగ్రాఫ్‌ను రూ. 100కి అమ్మిగా, ఆ తర్వాత యువత అతని చుట్టూ గుమిగూడారు. "భారతదేశంలో బాలీవుడ్‌కు ఉన్న క్రేజ్ ఇక్కడ కనిపించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో వాటిని కొనుగోలు చేశారు. ఇది చాలా మంచి బిజినెస్" అని ఆయన చెప్పాడు. పిల్లల నుంచి యువకులు, పెద్దలు కూడా ఈ ఆటోగ్రాఫ్‌లు నిజమైనవేనని నమ్మి వాటిని కొనుగోలు చేశారు. ఆరోజు చివరికి మొత్తం ఆటోగ్రాఫ్‌లు అమ్ముడుపోగా, సార్తక్ రూ. 3,200 సంపాదించాడు.

సార్తక్ సచ్‌దేవా గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వీడియోలతో వార్తల్లో నిలిచాడు. షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రెస్టారెంట్ 'తోరీ'లో 'నకిలీ పనీర్' వడ్డిస్తున్నారని ఆరోపించాడు. ఒక వీడియోలో ఆయన అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేసి, పనీర్ ముక్క నల్లగా మారడంతో అది నకిలీదని ప్రకటించాడు. అయితే, రెస్టారెంట్ యాజమాన్యం ఆ తరువాత స్పందిస్తూ, ఆ వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నాయని, అవి అయోడిన్‌తో సహజంగానే ప్రతిస్పందిస్తాయని వివరణ ఇచ్చింది.


More Telugu News