అప్పు తీర్చలేదని బాలిక కిడ్నాప్.. కొన్ని గంటల్లోనే కేసును ఛేదించిన ప్రకాశం పోలీసులు

  • ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఘటన 
  • పాఠశాల నుంచి 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఈశ్వర్ రెడ్డి
  • సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సాయంతో నిందితుడి కదలికలను ట్రేస్ చేసిన ఫోలీసులు
ప్రకాశం జిల్లా పోలీసులు బాలిక కిడ్నాప్ కేసులో త్వరితంగా స్పందించి, కేవలం రెండు గంటల్లోనే కేసును ఛేదించి 13 ఏళ్ల బాలికను సురక్షితంగా రక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. చీమకుర్తికి చెందిన శ్రీనివాస్ కరోనా సమయంలో జీవనోపాధి కోసం తన కుటుంబంతో తిరుపతికి వెళ్ళాడు. అక్కడ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇటీవల శ్రీనివాస్ కుటుంబం తిరిగి స్వగ్రామానికి వచ్చింది. 

అప్పు తిరిగి చెల్లించకపోవడంతో, ఈశ్వర్ రెడ్డి నిన్న చీమకుర్తికి వచ్చి, శ్రీనివాస్ కుమార్తె చదువుతున్న పాఠశాల వద్దకు వెళ్ళి, "నీ తల్లిదండ్రులు పంపారు" అంటూ ఆమెను బైక్‌పై తీసుకెళ్ళాడు. అనంతరం బాలిక చేతే ఆమె తండ్రికి ఫోన్ చేయించి, "రూ.5 లక్షలు తిరిగి ఇస్తేనే అమ్మాయిని వదులుతా, లేకపోతే చంపేస్తా" అని బెదిరించాడు.

ఈ ఘటనపై తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.

సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో బైక్ నంబర్ గుర్తించి, నిందితుడి కదలికలను ట్రేస్ చేశారు. చివరికి కావలి సమీపంలో ఈశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని, బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. 


More Telugu News