Kasturi: బీజేపీలో చేరిన సినీ నటి కస్తూరి.. కండువా కప్పి స్వాగతం పలికిన తమిళనాడు బీజేపీ చీఫ్

Kasturi Joins BJP Welcomed by Tamil Nadu BJP Chief
  • బీజేపీలో చేరిన నటి కస్తూరి, ట్రాన్స్‌జెండర్ నమిత మారిముత్తు
  • తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో సభ్యత్వ స్వీకరణ
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నైనార్ నాగేంద్రన్
ప్రముఖ సినీ నటి కస్తూరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. కస్తూరితో పాటు ట్రాన్స్‌జెండర్ కార్యకర్త నమితా మారిముత్తు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. నైనార్ నాగేంద్రన్ వారికి పార్టీ సభ్యత్వం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు.

కస్తూరి మోడల్‌గా రాణించడంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు.

గత సంవత్సరం నవంబర్ 3న చెన్నైలో హిందూ మక్కల్ కచ్చి నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమిళనాడులో నివసించే తెలుగు మాట్లాడే ప్రజలు తమను తాము తమిళులుగా చెప్పుకుంటున్నారని, కానీ ఏళ్ల క్రితం వలస వచ్చిన బ్రాహ్మణులను మాత్రం తమిళులుగా అంగీకరించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తెలుగు వారు పూర్వకాలంలో రాజుల అంతఃపురాల్లో పరిచారకులుగా పనిచేసిన వారి వారసులంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

ఈ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ నాయకులు సీఎంకే రెడ్డి, కార్యదర్శి ఆర్. నందగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రేటర్ చెన్నై పోలీసులు కస్తూరిపై కేసు నమోదు చేశారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు, ఆ వివాదం జరిగిన కొద్ది నెలలకే కస్తూరి బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Kasturi
Kasturi BJP
Tamil Nadu BJP
Nainar Nagendran
Namita Marimuthu
Tamil Nadu politics

More Telugu News