Jaggareddy: రాహుల్ గాంధీ కుటుంబ నేపథ్యంపై బీజేపీ విమర్శలు.. స్పందించిన జగ్గారెడ్డి

Jaggareddy Responds to BJP Criticism on Rahul Gandhi Family Background
  • రాహుల్ గాంధీది కశ్మీరి బ్రాహ్మణ కుటుంబమని వ్యాఖ్య
  • బీజేపీ నేతలు సోనియా, రాహుల్ గురించి మాట్లాడటం విడ్డూరమన్న జగ్గారెడ్డి
  • త్యాగాల చరిత్ర లేని బీజేపీ త్యాగాల కుటుంబంపై నిందలు వేయడమేమిటని ప్రశ్న
కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కుటుంబ నేపథ్యంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబమని తెలిపారు. బీజేపీ నేతలు సోనియా, రాహుల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. గాంధీ కుటుంబంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. త్యాగాల చరిత్ర లేని బీజేపీ త్యాగాల కుటుంబంపై నిందలు వేయడమేమిటని ఆయన ప్రశ్నించారు.

మోదీ, అమిత్ షా కుటుంబాల పెద్దలను అడిగితే గాంధీ కుటుంబం గొప్పతనం తెలుస్తుందని ఆయన అన్నారు. ధర్మం గురించి ఆలోచించే బీజేపీ నేతలకు వారసత్వం ఎలా ఉంటుందో తెలియదా అని నిలదీశారు. భర్త ఏ కులం అయితే భార్యది అదే కులం అవుతుందనే తెలివి లేదా అని చురక అంటించారు. సోనియా గాంధీ ఈ దేశానికి చెందిన మహిళే అని, ప్రజలు కూడా అంగీకరించారని చెప్పారు.

రాజీవ్ గాంధీ చనిపోయాక సోనియా గాంధీ అజ్ఞాత జీవితం గడిపారని, ప్రజలు కోరితే ఆమె రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. మనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోతేనే కొట్లాడుతామని, అలాంటిది సోనియా, రాహుల్ గాంధీలు ప్రధాని పదవిని వదిలేశారని వెల్లడించారు. బీజేపీ నాయకులు ఇలాంటి త్యాగం చేయగలరా అని ప్రశ్నించారు. నిన్న మొన్న పుట్టిన వారు కూడా గాంధీ కుటుంబం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

బీజేపీ నాయకులు సోనియా, రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజ్ పేయి, అద్వానీ హయాంలో నడిచినట్లుగా ఇప్పుడు బీజేపీ అలాంటి విలువలతో కొనసాగడం లేదని విమర్శించారు. దొంగ ఓట్ల కారణంగానే బీజేపీ మూడుసార్లు అధికారంలోకి వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే బీజేపీ నేతలకు తప్పు చేశామనే భయం మొదలైందని అన్నారు.
Jaggareddy
Rahul Gandhi
Sonia Gandhi
BJP
Congress
Indian politics
Gandhi family

More Telugu News