Darshan: జైల్లో స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా దర్శన్, ప్రజ్వల్.. జైలు అధికారులు ఏమ‌న్నారంటే..!

Actor Darshan and Prajwal Revanna refuse to attend Independence Day celebrations in jail
  • బెంగళూరు జైల్లో స్వాతంత్య్య దినోత్సవ వేడుకలకు దూరంగా దర్శన్, ప్రజ్వల్  
  • తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండటమే కారణమని జైలు వర్గాల వెల్లడి
  • సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో నిన్న‌ దర్శన్ అరెస్ట్
  • దర్శన్‌కు ఖైదీ నంబర్ 7314, పవిత్రకు 7313 కేటాయింపు
  • రాత్రంతా దర్శన్ నిద్రపోలేదని సమాచారం
  • దర్శన్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడన్న నటి రమ్య
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా, ఇద్దరు కన్నడ ప్రముఖులు మాత్రం జైలులో ఆ వేడుకలకు దూరంగా ఉన్నారు. అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్, అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు సెంట్రల్ జైలులో జరిగిన వేడుకల్లో పాల్గొనలేదు. తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండటంతో వారు తమ బ్యారక్‌లకే పరిమితమైనట్లు జైలు వర్గాలు శుక్రవారం తెలిపాయి.

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో దర్శన్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైలుకు వచ్చినప్పటి నుంచి దర్శన్ తీవ్రమైన మనోవేదనతో ఉన్నారని, రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదని సమాచారం. జైలు అధికారులు ఆయనకు ఖైదీ నంబర్ 7314ను కేటాయించారు. ఇదే కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన భాగస్వామి పవిత్ర గౌడకు ఖైదీ నంబర్ 7313 ఇచ్చారు. గతంలో దర్శన్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఖైదీ నంబర్‌తో అభిమానులు పచ్చబొట్లు వేయించుకోవడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను ఒకే బ్యారక్‌లో ఉంచారు.

మరోవైపు, అశ్లీల వీడియోలు, అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు ఆగస్టు 1న ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ పరిణామాలతో ఆయన కూడా మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది.

దర్శన్ జీవితాన్ని పాడుచేసుకున్నాడు: నటి రమ్య
ఈ పరిణామాలపై నటి, మాజీ ఎంపీ రమ్య స్పందించారు. దర్శన్ తన జీవితాన్ని తానే పాడుచేసుకున్నాడని విచారం వ్యక్తం చేశారు. "నేను దర్శన్‌తో కలిసి సినిమాల్లో నటించాను. ఒకప్పుడు స్టేజి లైట్ బాయ్‌గా కెరీర్ మొదలుపెట్టి స్టార్‌గా ఎదిగిన ఆయన కథ విని గర్వపడ్డాను. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన నన్ను నిరాశపరిచింది. జీవితంలో ఒక స్థాయికి వచ్చాక బాధ్యతగా ఉండాలి. ఆయన చుట్టూ మంచి స్నేహితులు లేరేమో అనిపిస్తోంది" అని ఆమె అన్నారు.

రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలని తాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు దర్శన్ అభిమానులు తనను తీవ్రంగా ట్రోల్ చేశారని రమ్య గుర్తుచేసుకున్నారు. "చట్టం ముందు అందరూ సమానమేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఈ తీర్పు సమాజానికి ఒక మంచి సందేశం పంపుతుంది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రేణుకాస్వామికి చివరికి న్యాయం జరిగింది" అని ఆమె పేర్కొన్నారు.
Darshan
Prajwal Revanna
Kannada actor
Renukaswamy murder case
actress Ramya
Karnataka politics
jail independence day celebrations
sexual assault case
Deve Gowda

More Telugu News