Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ కు అది డార్క్ సమయం.. వైసీపీ పాలనపై పవన్ విమర్శ

Pawan Kalyan Criticizes YCP Rule in Andhra Pradesh as Dark Era
  • కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
  • స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో కూటమి పాలన
  • వైసీపీ హయాంలో గొంతెత్తితే దాడులు జరిగేవని ఆరోపణ
2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి పాలన కొనసాగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. బ్రిటీష్ పాలన మాదిరిగా నాటి వైసీపీ పాలన సాగిందని అన్నారు. ఈ మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంతోమంది మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్ర్యం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు బలంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

గెలిస్తే న్యాయం.. ఓడిపోతే అన్యాయమా?
ప్రతిపక్ష నాయకుల తీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఒకలా, ఓటమి పాలైతే మరోలా ఉంటుందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ‘ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారు.. గెలిచినప్పుడు ఒక న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా?’ అని నిలదీశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవని ఆరోపించారు. అవినీతికి అలవాటుపడిన వాళ్లు ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan
Andhra Pradesh
AP Politics
YCP Government
YS Jagan
TDP
Telugu Desam
AP Elections 2024
India Independence Day
Kakinada

More Telugu News