యువతకు ప్రధాని మోదీ స్వాతంత్ర్య కానుక.. లక్ష కోట్ల రూపాయల ఉపాధి పథకం

  • యువత కోసం లక్ష కోట్ల 'వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ప్రారంభం
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని ప్రకటన
  • తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ప్రభుత్వం నుంచి రూ.15,000 సాయం
  • కొత్త ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు
  • రెండేళ్లలో 3.5 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యం
  • యువతకు ఇది తన బహుమతి అని పేర్కొన్న ప్రధానమంత్రి
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు శుభవార్త అందించారు. వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో 'వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' అనే ప్రతిష్ఠాత్మక పథకాన్ని ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఈ పథకం ద్వారా తొలిసారిగా ప్రైవేటు రంగంలో ఉద్యోగం పొందిన యువతీయువకులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తుందని స్పష్టం చేశారు.

"దేశ యువతకు ఓ పెద్ద శుభవార్త ఉంది. నా దేశ యువత కోసం ఈ రోజు లక్ష కోట్ల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నాం" అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పథకం ఆగస్టు 15 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. యువతకు తొలి ఉద్యోగంలో అడుగుపెట్టేందుకు ఈ ప్రోత్సాహకం ఎంతో తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పథకం కేవలం ఉద్యోగులకే కాకుండా, కొత్త ఉద్యోగాలను సృష్టించే ప్రైవేటు కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. కొత్తగా సిబ్బందిని నియమించుకునే సంస్థలకు, ఒక్కో కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తుంది. ముఖ్యంగా తయారీ రంగంలోని కంపెనీలకు ఈ ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

రాబోయే రెండేళ్లలో ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో దాదాపు 1.92 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించే వారు ఉంటారని అంచనా. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సంయుక్తంగా ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాయి.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే 'వికసిత్ భారత్' లక్ష్యంలో ఈ పథకం ఒక కీలక మైలురాయి అని ప్రధాని అభివర్ణించారు. "యువతకు ఇది నా బహుమతి. ఇది డబుల్ దీపావళి సంబరం లాంటిది" అని ఆయన అన్నారు. ఈ పథకం దేశ ఆర్థిక ప్రగతికి, యువత సాధికారతకు దోహదపడుతుందని భావిస్తున్నారు.


More Telugu News