Jammu Kashmir Cloudburst: జ‌మ్మూక‌శ్మీర్‌ జల విషాదం.. 46కు చేరిన మృతుల సంఖ్య‌

46 Dead After Massive Cloudburst In Jammu Kashmirs Kishtwar
  • జమ్మూకశ్మీర్‌ కిష్ట్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ 
  • ఆకస్మిక వరదలకు ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహా 46 మంది మృతి
  • శిథిలాల నుంచి 167 మందిని కాపాడిన సహాయక బృందాలు
  • మచైల్ మాతా యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
  • రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
  • ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి
జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం చషోతి గ్రామంలో మేఘవిస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 46కు చేరింది. మృతుల్లో ఇద్దరు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో ఏటా జరిగే మచైల్ మాతా యాత్రను అధికారులు తక్షణమే నిలిపివేశారు. చషోతి గ్రామం ఈ యాత్రకు ప్రారంభ స్థానం కావడంతో పెను ప్రమాదం సంభవించింది.

కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహానికి యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు శిథిలాల కింద నుంచి 167 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స‌మాచారం.

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా హామీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, తాను లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిన ఘటనా స్థలానికి పంపినట్లు పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ విషాదం నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించ తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను, ‘ఎట్ హోమ్’ టీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ఆర్మీ, పోలీసు, విపత్తు నిర్వహణ బృందాలను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Jammu Kashmir Cloudburst
Kishtwar
Machail Mata Yatra
Cloudburst
Jammu Kashmir Floods
CISF
NDRF
Omar Abdullah
Manoj Sinha
Amit Shah

More Telugu News