Roja: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై రోజా అనుమానాలు

Roja Doubts Pulivendula ZPTC Election Results Alleging Irregularities
  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంపై రోజా స్పందన
  • టీడీపీకి 88 శాతం ఓట్లు రావడంపై తీవ్ర అనుమానం వ్యక్తం చేసిన రోజా
  • సార్వత్రిక ఎన్నికల్లో 62 శాతం సాధించిన వైసీపీకి ఇప్పుడు 8 శాతమేనా అని ప్రశ్న
  • స్వతంత్ర అభ్యర్థులకు 0, 1, 2 ఓట్లు రావడం విచిత్రంగా ఉందన్న రోజా
  • ఇది అధికార దుర్వినియోగంతో వచ్చిన ఫలితమేనని తీవ్ర విమర్శ
  • పులివెందుల తీర్పు ప్రజా తీర్పు ఎలా అవుతుందని నిలదీత
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఫలితం ప్రజా తీర్పులా లేదని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం, అవకతవకల ఫలితమని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల లెక్కింపులో తేడాలను గణాంకాలతో సహా వివరిస్తూ ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

"2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల జడ్పీ టీసీ పరిధిలో వైసీపీ 62 ఓటు శాతం సాధించింది. అత్యంత ప్రతికూల పరిస్థితులలో జరిగిన ఎన్నికల్లో 62 శాతం ఓట్లు సాధించిన పార్టీకి, జగన్ అన్నకు అనుకూల వాతావరణం నెలకొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో 8.95 శాతం ఓట్లు రావడం ఏమిటో?

అదే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల పవనాలు వీచిన సమయంలో పులివెందుల జడ్పీ టీసీ పరిధిలో టీడీపీ సాధించింది 24 శాతం ఓట్లు మాత్రమే. ఎన్నికల హామీలు అమలు చేయకుండా పులివెందుల మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టిన ప్రతికూల పరిస్థితులలో టీడీపీకి 88 శాతం ఓట్లు రావడం ఏమిటో? 

మరోవైపు, ఐదుగురి స్వతంత్ర అభ్యర్థులకు వరుసగా 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం ఏమిటో?

అంటే... పోటీ చేసిన అభ్యర్థి తాలుకా ఏజెంట్లు, వారి కుటుంబ సభ్యులు కూడా వారికి ఓటు వేయరా?

ఇంకా విచిత్రంగా, పోటీ చేసిన అభ్యర్థి తన ఓటును కూడా తాను వేసుకోలేదా?... ఈ ఫలితాన్ని మనం నమ్మాలా? అధికార దుర్వినియోగం, అవకతవకలతో పులివెందుల తీర్పు ప్రజా తీర్పు ఎలా అవుతుంది..." అంటూ రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. 
Roja
Pulivendula ZPTC election
YSRCP
TDP
election results
Andhra Pradesh politics
election fraud
vote rigging
political allegations
Pulivendula medical college

More Telugu News