Musi River: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది... మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు

Musi River in Full Spate Floodwater Over Moosaram Bagh Bridge
  • భారీ వర్షాలతో నిండుకుండలా ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్
  • హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని వదిలిన అధికారులు
  • మూసీ ప్రవహించే పలు ప్రాంతాల్లో రాకపోకలు బంద్
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ జలాశయాలకు వరద నీరు చేరుతుండటంతో అవి నిండుకుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమయత్ సాగర్ గేట్లను ఎత్తి మూసీ నదిలోకి వరద నీటిని విడుదల చేశారు.

బాపుఘాట్, జియాగూడ, పురానాపూల్, నయాపూల్, ఛాదర్‌ఘాట్, మూసారాంబాగ్ వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జియాగూడ, పురానాపూల్ వద్ద పరివాహక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. జియాగూడ బైపాస్‌లోకి వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మూసీ నదిని ఆనుకొని ఉన్న పలు ఆలయాలు, శ్మశాన వాటికల్లోకి వరద నీరు చేరింది. ఛాదర్‌ఘాట్ వద్ద చిన్న వంతెనను తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ వద్ద వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రెండు రోజుల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
Musi River
Hyderabad Rains
Osman Sagar
Himayat Sagar
Flood Alert Hyderabad
Moosaram Bagh Bridge

More Telugu News