వెస్టిండీస్ చేతిలో పాక్ అవమానకర ఓటమి... అక్తర్ ఫైర్

  • వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్
  • మూడో వన్డేలో 202 పరుగుల భారీ తేడాతో ఓటమి
  • 92 పరుగులకే కుప్పకూలిన పాక్ బ్యాటింగ్ లైనప్
  • జట్టు ఆటతీరుపై మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఫైర్
  • ఆటగాళ్లు స్వార్థంతో ఆడుతున్నారని తీవ్ర విమర్శ
  • సొంత సగటు కోసమే తప్ప దేశం కోసం ఆడటం లేదని వ్యాఖ్య
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు దేశం కోసం కాకుండా, తమ స్వప్రయోజనాలు, వ్యక్తిగత సగటు మెరుగుపరుచుకోవడం కోసమే ఆడుతున్నారని అక్తర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో పాక్ జట్టు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో పాక్ జట్టు 202 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కేవలం 92 పరుగులకే కుప్పకూలడం గమనార్హం. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ డకౌట్ కాగా, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ పేలవ ప్రదర్శనపై షోయబ్ అక్తర్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గత 10-15 ఏళ్లుగా జట్టులో వాతావరణం మారిపోయింది. మా హయాంలో మేమంతా దేశం కోసం, గెలవాలనే పట్టుదలతో ఆడేవాళ్లం. కానీ ఇప్పుడు ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనలపైనే దృష్టి పెడుతున్నారు. దేశం గెలవాలనే సంకల్పం వారిలో కనిపించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

పరిస్థితులకు అనుగుణంగా ఆటతీరును మార్చుకోవడంలో కూడా ఆటగాళ్లు విఫలమవుతున్నారని అక్తర్ విమర్శించాడు. "బంతి స్వింగ్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా ఆడాలి. ప్రతీ పిచ్ రావల్పిండిలా ఉండదు... మ్యాచ్ ఆడే ప్రతి చోటకి రావల్పిండి పిచ్ ను తీసుకెళ్లలేం... పరిస్థితులను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయాలి" అని ఆటగాళ్లకు చురకలు అంటించాడు.

కాగా, ఈ పర్యటనలో పాకిస్థాన్ టీ20 సిరీస్‌ను గెలుచుకున్నప్పటికీ, వన్డే సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో వెస్టిండీస్‌కు సమర్పించుకుంది.


More Telugu News