Viral Video: బీచ్‌లో పంజాబీ పాటలు.. భారతీయులపై కెనడియన్ ఫైర్.. మాకొక రూల్, మీకొక రూలా?

Canadian Man Slams Indian Family For Playing Loud Music At Beach Sparks Debate
  • కెనడా బీచ్‌లో పంజాబీ పాటలపై కెనడియన్ వ్యక్తి ఆగ్రహం
  • పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ పెట్టారని వీడియో తీసి పోస్ట్
  • తాను గిటార్ వాయిస్తే ఫైన్ వేశారని అధికారులపై విమర్శలు
  • సోషల్ మీడియాలో వీడియోపై తీవ్ర చర్చ, దుమారం
  • నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు, భిన్నాభిప్రాయాలు
కెనడాలోని ఓ బీచ్‌లో భారత సంతతికి చెందిన కుటుంబం పెద్ద సౌండ్‌తో పంజాబీ పాటలు పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ కెనడియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. 

అస‌లేం జ‌రిగిందంటే..?
ఒంటరిగా సంగీత ప్రదర్శనలు ఇచ్చే ఓ కెనడియన్ కళాకారుడు బ్యారీ నగరంలోని బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ భారతీయ కుటుంబం స్పీకర్‌లో పెద్ద సౌండ్‌తో పంజాబీ పాటలు పెట్టి, నీళ్లలో ఆడుకుంటూ కనిపించింది. దీన్ని వీడియో తీసిన ఆ వ్యక్తి, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. "బీచ్‌కు వచ్చి ఇష్టమొచ్చిన పాటలు, నచ్చినంత సౌండ్‌తో పెట్టుకోవడానికి ఇదో ఉదాహరణ. పాటలు పెట్టినవాళ్లు ఇక్కడ లేరు. కానీ, 150 అడుగుల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని వినాల్సిందే. బ్యారీ నగరం చాలా గొప్పగా పనిచేస్తోంది" అంటూ అని విమ‌ర్శించాడు.

గతంలో తాను ఇదే బీచ్‌లో ఓ ఫుడ్ బ్యాంక్ కోసం నిధులు సేకరించేందుకు గిటార్ వాయిస్తే అధికారులు తనకు జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. "నేను మంచి పని కోసం గిటార్ వాయిస్తే మాత్రం ఒప్పుకోరు. కానీ ఇక్కడకి ఎవరైనా వచ్చి, ఇతరులందరినీ ఇబ్బంది పెట్టేలా పాటలు పెట్టుకోవచ్చు" అని అధికారుల ద్వంద్వ వైఖరిని నిల‌దీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది అతడికి మద్దతు తెలుపగా, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. "పెద్ద మనిషివై ఉండి ఇంటర్నెట్‌లో ఏడవడం ఎందుకు? నేరుగా వాళ్లతో మాట్లాడి సౌండ్ తగ్గించమని అడగవచ్చు కదా?" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. "వలసదారులను కించపరచడానికే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. పోయినవారం నేను వెళ్లినప్పుడు ఇంగ్లిష్ పాటలు పెద్ద సౌండ్‌తో పెట్టారు, నేనెవరినీ ఏమీ అనలేదు. అనవసర రాద్ధాంతం మానుకోండి" అని మరో యూజర్ మండిపడ్డారు. "బతుకు, బతకనివ్వు. ప్రతీదాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు" అంటూ ఇంకొందరు హితవు పలికారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Viral Video
Barry
Barry beach
Canada
Punjabi songs
Indian family
beach music
Canadian rules
discrimination
social media

More Telugu News