Dhiraj Singh Thakur: ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణ స్వీకారం

Dhiraj Singh Thakur Administers Oath to Four Permanent Judges in AP High Court
  • ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ హరినాధ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో నలుగురు అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టులో ఇప్పటి వరకు అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న జస్టిస్ హరినాధ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ (కిరణ్మయి కనపర్తి), జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాలకు అనుగుణంగా నిన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆ నలుగురు అదనపు న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ పి.సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీ నారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపి లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఏపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
Dhiraj Singh Thakur
AP High Court
Andhra Pradesh High Court
Justices sworn in
Justice Harinath Nunepalli
Justice Kiranmayi Mandava
Justice Sumathi Jagadam
Justice Nyapathi Vijay
AP bar council
Droupadi Murmu

More Telugu News