Rahul Gandhi: సావర్కర్, గాడ్సే భావజాలాన్ని అనుసరిస్తున్న వారి నుంచి నాకు ముప్పు ఉండొచ్చు: రాహుల్ గాంధీ

Rahul Gandhi Faces Threat From Savarkar Godse Followers
  • ముప్పు పొంచి ఉండవచ్చని పుణే కోర్టుకు తెలిపిన రాహుల్ గాంధీ
  • అవసరమైన భద్రత కల్పించడం కేంద్రం బాధ్యత అన్న రాహుల్ గాంధీ
  • రాహుల్ గాంధీ ఆరోపణలను కొట్టి పారేసిన పిటిషనర్ సాత్యకి
వీర సావర్కర్, నాథూరాం గాడ్సే భావజాలాన్ని అనుసరిస్తున్న వారి నుంచి తనకు ముప్పు పొంచి ఉండవచ్చని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సావర్కర్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పరువునష్టం కేసు నమోదైన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో ఆయన తనకు ముప్పు పొంచి ఉండవచ్చని పుణే కోర్టుకు తెలిపారు. తనకు అవసరమైన భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు.

2023లో లండన్ పర్యటన సమయంలో సావర్కర్‌ను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సావర్కర్ మునిమనవడు సాత్యకి సావర్కర్ ఆయనపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు గతంలో తేల్చారు. దీనిపై పుణేలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది కోర్టుకు తాజాగా ఓ దరఖాస్తును సమర్పించారు.

తనకు నాథూరాం గాడ్సే, సావర్కర్ కుటుంబాలతో సంబంధం ఉందని సాత్యకి గతంలో వెల్లడించారని, కాబట్టి ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే సావర్కర్, గాడ్సే భావజాలానికి మద్దతు ఇచ్చే వ్యక్తుల నుంచి రాహుల్ గాంధీకి ముప్పు పొంచి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు రక్షణ అవసరమని పేర్కొన్నారు.

విచారణ ఆలస్యం కావడం వల్లే రాహుల్ గాంధీ ఈ అప్లికేషన్ దాఖలు చేశారని సాత్యకి సావర్కర్ ఆరోపించారు. అందులో పేర్కొన్న వాస్తవాలకు, ప్రస్తుత కేసుతో ఎటువంటి సంబంధం లేదని మీడియాతో అన్నారు.
Rahul Gandhi
Veer Savarkar
Nathuram Godse
Defamation case
Satyaki Savarkar
Indian National Congress

More Telugu News