Tirumala: తిరుమలలో దర్శనం, వసతి పేరిట 30 నకిలీ వెబ్ సైట్లు... పోలీసుల కీలక సూచనలు

Tirumala police warn devotees about 30 fake websites
  • శ్రీవారి భక్తులను లక్ష్యంగా చేసుకుని పెరిగిపోతున్న సైబర్ మోసాలు
  • దర్శనం, వసతి పేరుతో నకిలీ వెబ్‌సైట్లను గుర్తించిన పోలీసులు
  • ఇప్పటికే 28 మోసపూరిత వెబ్‌సైట్లను తొలగించినట్లు వెల్లడి
  • టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేసుకోవాలని సూచన
  • అనుమానిత సైట్లు, కాల్స్ పై పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దర్శనం టికెట్లు, వసతి సౌకర్యాలు కల్పిస్తామంటూ ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తిరుమల పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, కేటుగాళ్ల వలలో చిక్కుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, శ్రీవారి సేవల పేరుతో నడుస్తున్న 30కి పైగా నకిలీ వెబ్‌సైట్లను గుర్తించారు. వీటిని సెర్చ్ ఇంజిన్‌ల నుంచి శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 28 మోసపూరిత వెబ్‌సైట్లను విజయవంతంగా తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు.

భక్తులను సులభంగా ఆకర్షించేందుకు సైబర్ నేరగాళ్లు సప్తగిరి గెస్ట్‌హౌస్, నందకం గెస్ట్‌హౌస్, పద్మావతి గెస్ట్‌హౌస్ వంటి పేర్లతో వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి పేర్లతో కనిపించే వెబ్‌సైట్లు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సేవల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.org ను మాత్రమే ఆశ్రయించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

అపరిచిత వ్యక్తులు వాట్సాప్ కాల్స్ చేసి దర్శనం కల్పిస్తామని చెప్పినా, క్యూఆర్ కోడ్‌లు పంపి డబ్బులు చెల్లించమని కోరినా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఏదైనా వెబ్‌సైట్‌పై అనుమానం కలిగినా లేదా ఎవరైనా మోసపూరితంగా సంప్రదించినా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో గానీ, 100 నంబర్‌కు గానీ, టీటీడీ టోల్ ఫ్రీ నంబర్ 18004254141కు గానీ ఫిర్యాదు చేయాలని కోరారు.
Tirumala
Tirumala fake websites
TTD
Tirupati police
online fraud
cyber crime
Srivari darshan
accommodation
guest house

More Telugu News