దడపుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్ .. 'జారన్'

  • మరాఠీలో నిర్మితమైన 'జారన్'
  • చేతబడి నేపథ్యంలో సాగే కథ 
  • ఈ నెల 8 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ 
  • భయపెడుతూనే ట్రెండింగ్ లోకి వెళ్లిన కంటెంట్   

హారర్ థ్రిల్లర్ అనగానే దాదాపు దెయ్యం సినిమానే అని అంతా అనుకుంటారు. అయితే దెయ్యం సినిమాల కంటే ఎక్కువగా ప్రేక్షకులను భయపెట్టే కంటెంట్ మరొకటి ఉంది .. అదే 'చేతబడి'. దెయ్యాల సినిమాలను నలుగురితో కలిసి చూడటానికైనా కొంతమంది సాహసం చేస్తారు గానీ, 'చేతబడి' సినిమాల వైపు చూసే ధైర్యం మాత్రం చేయరు. ఎందుకంటే ఆ తంతు అంత భయంకరంగా ఉంటుంది మరి!

అలా చేతబడి నేపథ్యంలో రూపొందిన మరాఠీ సినిమానే 'జారన్'. మరాఠీలో 'జారన్' అంటే చేతబడి అని అర్థం. అమోల్ భగత్ - నితిన్ బాలచంద్ర కులకర్ణి నిర్మించిన ఈ సినిమాకి, రిషికేశ్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జూన్ 6వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కంటెంట్ ను ఇలా వదలగానే అలా ట్రెండింగ్ లోకి వెళ్లింది. 

అమృత సుభాశ్ .. అనిత కేల్కర్ .. కిశోర్ ..అవని జోషి .. సీమా దేశ్ ముఖ్ .. సోనాలి కులకర్ణి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, భయపడుతూనే చూసే కంటెంట్ గా చెబుతున్నారు. ఈ మరాఠీ కథ .. అక్కడి పాత కాలపు ఆచార సంప్రదాయాలను గుర్తుచేస్తూ నడుస్తుంది. భర్త .. కూతురుతో కలిసి అక్కడ నివసించే రాధకి చేతబడి చేస్తారు. ఆమెకి చేతబడి ఎవరు చేస్తారు? అందుకు కారణం ఏమిటి? ఆ క్షుద్ర శక్తి బారి నుంచి రాధ బయటపడుతుందా? అనేది కథ. 



More Telugu News