లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించండి: కెనడాలో డిమాండ్

  • కార్నీ ప్రభుత్వానికి కన్జర్వేటివ్ పార్టీ లేఖ
  • ఈ గ్యాంగ్ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తోందని లేఖ
  • నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తోందని, కెనడా పౌరులను దోచుకుంటోందని ఆందోళన
కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ కన్జర్వేటివ్ పార్టీ తాజాగా మార్క్ కార్నీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ గ్యాంగ్ సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తోందని, వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు పెరుగుతున్నాయంటూ స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కపిల్ శర్మ కేఫ్‌పై రెండుసార్లు కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ కాల్పుల్లో బిష్ణోయ్ గ్యాంగ్ పాత్ర ఉందనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తోందని, కెనడా పౌరులను దోచుకుంటోందని, హత్య కేసుల్లో వారి ప్రమేయం ఉందని కెనడా ఎంపీ ఫ్రాంకా కాపుటో ఆ లేఖలో పేర్కొన్నారు. స్థానికంగా, విదేశాల్లో పలు హింసాత్మక ఘటనలకు తామే బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుందని గుర్తు చేశారు.

రాజకీయ, మతపరమైన, సైద్ధాంతిక కారణాలతో ఈ గ్యాంగ్ అనేక సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, ఈ అంశాలన్నీ వారిని ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చడానికి తగిన కారణలని లేఖలో పేర్కొన్నారు. తద్వారా వీరి కార్యకలాపాలను అణిచివేసేందుకు భద్రతా సంస్థలకు అవకాశం ఉంటుందని తెలిపారు.

బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలపై పలువురు కెనడా రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ సహా నలుగురు కెనడియన్ నేతలు గతంలో ఇలాంటి విజ్ఞప్తులు చేశారని తెలిపారు. బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబే, అల్బెర్టా ప్రీమియర్ డేనియల్ స్మిత్, సర్రే మేయర్ బ్రెండా లాకీలు కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరిన వారిలో ఉన్నారని వెల్లడించారు. ఈ గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవడానికి రాజకీయంగా ఏకాభిప్రాయం ఉందని స్పష్టం చేశారు.


More Telugu News