Asaduddin Owaisi: పాక్ అణు హెచ్చరికలు.. అమెరికాకు గట్టిగా చెప్పాలన్న అసదుద్దీన్ ఒవైసీ

Owaisi urges Centre to take up Pak Army Chiefs threat with US
  • అమెరికా పర్యటనలో భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులు
  • తీవ్రంగా ఖండించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
  • కేవలం ప్రకటనలు కాదు, రాజకీయంగా స్పందించాలన్న అసద్
  • అమెరికాతో గట్టిగా నిరసన తెలపాలని కేంద్రానికి డిమాండ్
  • రక్షణ బడ్జెట్ పెంచి, సైన్యాన్ని ఆధునికీకరించాలని సూచన
  • అణు బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేసిన భారత ప్రభుత్వం
అమెరికా గడ్డపై నుంచి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ భారత్‌పై అణు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా, ఈ అంశాన్ని మోదీ ప్రభుత్వం అమెరికా వద్ద బలంగా ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు ‘ఎక్స్‌’ వేదికగా ఒవైసీ స్పందిస్తూ, "భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఉపయోగించిన భాష, ఆయన చేసిన బెదిరింపులు తీవ్రంగా ఖండించదగినవి. అమెరికా గడ్డపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత దారుణం. దీనిపై మోదీ ప్రభుత్వం కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా రాజకీయంగా స్పందించాలి. అమెరికా ప్రభుత్వానికి గట్టిగా నిరసన తెలపాలి" అని పేర్కొన్నారు.

అమెరికా మనకు వ్యూహాత్మక భాగస్వామి అని, అలాంటి దేశపు గడ్డను భారత్‌కు వ్యతిరేకంగా వాడుకోవడాన్ని అంగీకరించలేమని ఒవైసీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ సైనిక కుట్రల నేపథ్యంలో భారత సైన్యాన్ని మరింత ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని, మోదీ ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ సరిపోదని ఆయన విమర్శించారు.

ఏం జరిగిందంటే?
గత శనివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో పాకిస్థానీ ప్రవాసులతో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో అసిమ్ మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "మేం (పాకిస్థాన్) ఒక అణుశక్తి దేశం. మేం పతనమవుతున్నామని భావిస్తే, మాతో పాటు సగం ప్రపంచాన్ని ముంచేస్తాం" అని ఆయన హెచ్చరించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఘాటుగా స్పందించిన భారత్
పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ చేసే అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "పాకిస్థాన్ అణు బెదిరింపులకు పాల్పడటం మామూలే. ఉగ్రవాద సంస్థలతో సైన్యం అంటకాగుతున్న దేశంలో అణ్వాయుధాల నియంత్రణ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో అంతర్జాతీయ సమాజం గమనించాలి" అని వ్యాఖ్యానించారు.
Asaduddin Owaisi
Pakistan
India
nuclear threats
MEA
America
Asim Munir
Indian Army
defense budget
terrorism

More Telugu News