Palla Srinivasa Rao: పులివెందుల ప్రజలు వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారు: పల్లా శ్రీనివాసరావు

TDP Leader Palla Predicts YSRCPs Defeat in Pulivendula
  • పులివెందుల, ఒంటిమిట్టలో కూటమి అభ్యర్థులు గెలుస్తారన్న పల్లా
  • కూటమి గెలుపుపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్య
  • తమ ఎత్తులు సాగడం లేదని వైసీపీ బాధపడుతోందని ఎద్దేవా
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ నేపథ్యంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... రెండు చోట్ల కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కూటమి గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదని అన్నారు. వైసీపీ అరాచకాలకు తెరదించేలా ఓటర్లు తీర్పును ఇవ్వబోతున్నారని చెప్పారు. 

ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరుగుతుంటే... తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా బాధపడుతోందని పల్లా ఎద్దేవా చేశారు. ఏదో రకంగా ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు వైసీపీ పసలేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి 'సేవ్ డెమోక్రసీ' అంటూ గగ్గోలు పెడుతూ ఓటర్ల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఓటర్లు వీరి కుయుక్తులను పసిగట్టారని... వీరికి దిమ్మతిరిగే తీర్పును ఇవ్వబోతున్నారని చెప్పారు. 

పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాలు కూటమి ఖాతాలోకి చేరబోతున్నాయని పల్లా ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రజల సహకారం పూర్తిగా ఉంటుందని విశ్వసిస్తున్నానని అన్నారు.
Palla Srinivasa Rao
Pulivendula
Ontimitta
ZPTC elections
TDP
YSRCP
Andhra Pradesh politics
Avinash Reddy
Telugu Desam Party
Alliance victory

More Telugu News