Chaya Purav: ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్.. నాలుగు గంటల నరకయాతన.. భర్త కళ్లెదుటే ప్రాణాలు వదిలిన భార్య

Maharashtra Woman Dies in Ambulance Stuck in NH 48 Traffic Jam
  • మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో చెట్టు కొమ్మ పడి తీవ్రంగా గాయపడిన ఛాయా పురవ్ అనే మ‌హిళ‌
  • జిల్లాలో ట్రామా సెంటర్ లేకపోవడంతోి ముంబైకి తరలింపు
  • జాతీయ రహదారి-48పై గంటల తరబడి నిలిచిపోయిన అంబులెన్స్
  • మరో 30 నిమిషాల ముందు వస్తే బతికేవారని వైద్యుల వెల్లడి
  • త‌న భార్య నాలుగు గంటల పాటు నొప్పితో అరుస్తూ విల‌విల్లాడిందన్న భ‌ర్త‌
ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడంతో, ఓ మహిళ మార్గమధ్యంలోనే నరకయాతన అనుభవించి ప్రాణాలు విడిచింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన, అక్కడి వైద్య సదుపాయాల కొరతను, జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తీవ్రతను కళ్లకు కట్టింది.

వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్ జిల్లాలోని మధుకర్ నగర్‌కు చెందిన ఛాయా పురవ్ (49) అనే మహిళపై జులై 31న ఇంటి సమీపంలో ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆమె తల, పక్కటెముకలు, భుజాలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, పాల్ఘర్ జిల్లాలో అత్యవసర చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్ అందుబాటులో లేదు. దీంతో స్థానిక వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం 100 కిలోమీటర్ల దూరంలోని ముంబైలోని హిందూజా ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

సాధారణంగా ఈ ప్రయాణానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. దీంతో వైద్యులు ఆమెకు అనస్థీషియా ఇచ్చి, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో ముంబైకి పంపారు. ఆమె భర్త కౌశిక్ కూడా అంబులెన్స్‌లోనే ఉన్నారు. అయితే, జాతీయ రహదారి-48పై వారు ఊహించని ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. మూడు గంటలు గడిచినా వారు సగం దూరం కూడా ప్రయాణించలేకపోయారు.

సాయంత్రం 6 గంటల సమయానికి అనస్థీషియా ప్రభావం తగ్గడంతో ఛాయా పురవ్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడారు. ఆమె పరిస్థితి విషమించడంతో, అంబులెన్స్ సిబ్బంది గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరా రోడ్‌లోని ఆర్బిట్ ఆసుపత్రికి రాత్రి 7 గంటల సమయంలో తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు, ఛాయా పురవ్ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. మరో అరగంట ముందుగా ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఆమె ప్రాణాలు కాపాడగలిగేవాళ్లమని వైద్యులు తెలిపినట్లు భర్త కౌశిక్ కన్నీటిపర్యంతమయ్యారు. 

నాలుగు గంటల నరకయాతన: భ‌ర్త ఆవేద‌న‌
"నాలుగు గంటల పాటు ఆమె నొప్పితో అరుస్తూ, ఏడుస్తూ కనిపించింది. త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లమని వేడుకుంది. కానీ మేం నిస్సహాయులమైపోయాం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై గుంతలు, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ట్రాఫిక్ మరింత పెరిగిపోయిందని వాపోయారు. ఈ ఘటన పాల్ఘర్‌లో వైద్య సదుపాయాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసింది.
Chaya Purav
Palghar
Maharashtra
Traffic Jam
Ambulance
Road Accident
Medical Facilities
Mumbai
National Highway 48
Patient Death

More Telugu News