Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈవో నోటీసులు

Rahul Gandhi Receives Notice from Karnataka CEO
  • ఓటర్ల జాబితాలో లోపాలపై ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ 
  • ఆరోపణలపై విచారణ జరిపేందుకు సంబంధిత పత్రాలు అందజేయాలన్న కర్ణాటక సీఈవో
  • తమ విచారణలో సుకున్ రాణి అనే మహిళ ఒక్కసారే ఓటు వేశారన్న సీఈవో
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) నోటీసులు జారీ చేశారు. భారత ఎన్నికల వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ ఇటీవల రాహుల్ గాంధీ తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో ఒక మహిళా ఓటరు రెండుసార్లు ఓటేశారంటూ రాహుల్ ఆరోపణలు చేశారు.

దీనిపై కర్ణాటక సీఈవో స్పందిస్తూ, ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు సంబంధిత పత్రాలను సమర్పించాలని రాహుల్‌కు సూచించింది. మరోవైపు, ఎన్నికల సంఘం కూడా ఓట్ల చోరీ ఆరోపణలపై డిక్లరేషన్ సమర్పించాలని లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని మరోసారి కోరింది.

ఇటీవల రాహుల్ గాంధీ తన ప్రజెంటేషన్‌లో చూపిన పత్రాలు ఎన్నికల కమిషన్ రికార్డుల నుంచి సేకరించినట్లుగా చెప్పారు. అలాగే పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శుకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని రాహుల్ ఆరోపించారు.

అయితే, తమ విచారణలో ఆమె ఒక్కసారే ఓటు వేశానని చెప్పారని కర్ణాటక సీఈవో పేర్కొన్నారు. ఆమె రెండుసార్లు ఓటేశారంటూ ప్రజెంటేషన్‌లో చూపిన టిక్ మార్క్ పత్రాలు కూడా పోలింగ్ అధికారి జారీ చేసినవి కావని వెల్లడైందన్నారు. కాబట్టి, ఆరోపణలకు సంబంధించిన పత్రాలను అందించాలని, తద్వారా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టవచ్చని రాహుల్ గాంధీకి జారీ చేసిన నోటీసులో కర్ణాటక సీఈవో పేర్కొన్నారు. 
Rahul Gandhi
Karnataka CEO
Election Commission
Voter fraud
India elections
Shukun Rani
Karnataka elections
Rahul Gandhi allegations

More Telugu News