పాతబస్తీలో రికార్డు వర్షపాతం.. రానున్న 15 రోజులు కీలకం!

  • హైదరాబాద్‌ను మరోసారి ముంచెత్తిన కుండపోత వర్షం
  • ఆగస్టు నెలలో 100 మి.మీ. దాటడం ఇది మూడోసారి
  • పాతబస్తీలోని బేగంబజార్‌లో అత్యధికంగా 117.5 మి.మీ. వర్షపాతం
  • రోడ్లు జలమయం కావడంతో గంటల తరబడి నిలిచిన ట్రాఫిక్
  • తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలుంటాయని ఐఎండీ సూచన
భాగ్యనగరాన్ని భారీ వర్షాలు మరోసారి అతలాకుతలం చేశాయి. గత రాత్రి కురిసిన కుండపోత వానతో నగర జీవనం అస్తవ్యస్తంగా మారింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రహదారులన్నీ చెరువులను తలపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గత రాత్రి నగరంలోని అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా పాతబస్తీలోని బేగంబజార్‌లో అత్యధికంగా 117.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సర్దార్ మహల్‌లో 106.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వీటితో పాటు వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్, గుర్రంగూడ ప్రాంతాల్లో కూడా 100 మిల్లీమీటర్లకు చేరువలో వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, నాంపల్లి, ఆసిఫాబాద్, హయత్‌నగర్ వంటి ఇతర ప్రాంతాల్లో సైతం 90 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడింది.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, శనివారం నాటి వర్షంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పలుచోట్ల చెట్లు విరిగిపడటం, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోయింది.

ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో వర్షపాతం 100 మిల్లీమీటర్లు దాటడం ఇది మూడోసారని స్థానిక వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న 10 నుంచి 15 రోజుల పాటు నగరంలో ఇలాంటి భారీ వర్షాలు మరిన్ని కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సైతం ప్రకటించింది. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


More Telugu News