Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్.. లగ్జరీ ఫ్లాట్లకే జై కొడుతున్న నగరవాసులు!

Hyderabad Real Estate Sees New Trend Luxury Flats in Demand
  • హైదరాబాద్‌లో భారీగా పెరిగిన లగ్జరీ ఫ్లాట్ల డిమాండ్
  • రూ. కోటిన్నర నుంచి రూ. 3 కోట్ల ధరల ఫ్లాట్ల అమ్మకాల్లో వృద్ధి
  • రూ. 70 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం
  • మొత్తం ఫ్లాట్ల అమ్మకాల సంఖ్య తగ్గినా, రాబడిలో స్వల్ప పెరుగుదల
  • ఆదాయ వాటాలో రూ. 3 కోట్ల పైబడిన ఫ్లాట్లదే అగ్రస్థానం
భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ స్వరూపం వేగంగా మారుతోంది. తక్కువ ధరల ఇళ్లకు గిరాకీ తగ్గి, విలాసవంతమైన, ఖరీదైన ఫ్లాట్ల వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఫ్లాట్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2025 ప్రథమార్ధంలో హైదరాబాద్ రియల్ మార్కెట్‌పై క్రెడాయ్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

నివేదిక ప్రకారం 2024 ప్రథమార్ధంతో పోలిస్తే 2025 ప్రథమార్ధంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రూ. 1.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మధ్య ధర కలిగిన ఫ్లాట్ల అమ్మకాల రాబడి వాటా భారీగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో 28 శాతంగా ఉన్న ఈ వాటా, ఈ ఏడాది 34 శాతానికి ఎగబాకింది. అదే సమయంలో, రూ. 3 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఫ్లాట్లు తమ 35 శాతం రాబడి వాటాను నిలబెట్టుకుని అగ్రస్థానంలో కొనసాగాయి.

ఈ ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా, సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఇళ్ల మార్కెట్ డీలా పడింది. రూ. 70 లక్షల లోపు ధర ఉన్న ఫ్లాట్ల రాబడి వాటా 7 శాతం నుంచి కేవలం 3 శాతానికి పడిపోయింది. అలాగే, రూ. 70 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల మధ్య ధరల ఫ్లాట్ల వాటా కూడా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది.

మరోవైపు, 2025 మొదటి ఆరు నెలల్లో నగరంలో అమ్ముడైన మొత్తం ఫ్లాట్ల సంఖ్యలో 11 శాతం క్షీణత కనిపించింది. ఈ కాలంలో సుమారు 30 వేల ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. అయితే, అమ్మకాల సంఖ్య తగ్గినా, ఖరీదైన గృహాలకు డిమాండ్ పెరగడంతో మొత్తం విక్రయాల విలువలో 2 శాతం స్వల్ప వృద్ధి నమోదవడం గమనార్హం. ఈ గణాంకాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లగ్జరీ విభాగం వైపు స్పష్టంగా పయనిస్తోందని సూచిస్తున్నాయి.
Hyderabad Real Estate
Luxury flats
Real estate trends
Property market
Apartment sales
CRE Matrix
Credai
Hyderabad property prices
High end apartments
Residential property

More Telugu News