Uttarakhand Flood Victims: మాకొద్దీ సాయం.. ప్రభుత్వ చెక్కులను వెనక్కిచ్చిన ఉత్తరాఖండ్ వరద బాధితులు

Uttarakhand Flood Victims Return Govt Checks Angered by Insufficient Aid
  • ప్రభుత్వం ఇచ్చిన రూ.5000 చెక్కులను తిరస్కరించిన వరద బాధితులు
  • సాయం చాలా తక్కువంటూ గ్రామస్థుల తీవ్ర ఆగ్రహం
  • పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామన్న ప్రభుత్వం
  • ఘోర విపత్తులో ఐదుగురి మృతి, 49 మంది గల్లంతు
  • మృతుల కుటుంబాలకు, ఇళ్లు కోల్పోయినవారికి రూ.5 లక్షల పరిహారం ప్రకటన
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • 1000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఉత్తరాఖండ్ వరద బాధితులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన నష్టంతో పోలిస్తే ప్రభుత్వం అందిస్తున్న సాయం చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేస్తూ, తక్షణ సాయం కింద ఇచ్చిన రూ.5,000 చెక్కులను తిరస్కరించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధారాలి గ్రామంలో చోటుచేసుకుంది.

కొన్ని రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదలకు ధారాలి, హర్షిల్‌ గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని ప్రభుత్వం బాధితులకు తక్షణ సాయం కింద రూ.5,000 చొప్పున చెక్కులను పంపిణీ చేసింది. అయితే, తమ ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు సర్వం కోల్పోయిన తమకు ఈ సాయం అవమానకరంగా ఉందని గ్రామస్థులు నిరసన తెలిపారు.

ఈ విషయంపై ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య స్పందిస్తూ.. ఇది కేవలం తక్షణ ఉపశమనం కోసం ఇచ్చిన మధ్యంతర సాయం మాత్రమేనని తెలిపారు. "పూర్తి నష్టాన్ని అంచనా వేసి, నివేదిక సిద్ధం చేశాక బాధితులకు సరైన పరిహారం అందజేస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.

కాగా, వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వరదల్లో ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. బాధితులకు పునరావాసం, జీవనోపాధి కల్పించే ప్రణాళికను సిద్ధం చేయడానికి రెవెన్యూ కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు.

నిన్న ఐదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. హెలికాప్టర్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు, ఆహార పొట్లాలను జారవిడుస్తున్నారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్ఎఫ్) జాగిలాలు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలతో ధారాలి బజార్‌లోని శిథిలాల కింద గాలింపు చర్యలు చేపట్టింది. ఈ విపత్తులో ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్టు అధికారులు ధ్రువీకరించగా, ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో 49 మంది గల్లంతైనట్టు తెలిపారు. వెయ్యి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్‌లను పునరుద్ధరిస్తూ, సామూహిక వంటశాలల ద్వారా బాధితులకు ఆహారం, దుస్తులు అందిస్తున్నారు.
Uttarakhand Flood Victims
Uttarakhand floods
Pushkar Singh Dhami
Uttarkashi district
Dharali village
Flood relief
Natural disaster
Compensation
SDRF
राहत सामग्री

More Telugu News