ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఖాతాదారులకు షాక్!

ICICI bank hikes minimum account balance for new customers
  • ఐసీఐసీఐ బ్యాంకులో భారీగా పెరిగిన కనీస నెలవారీ బ్యాలెన్స్
  • ఈ నెల‌ 1 నుంచి తెరిచే కొత్త సేవింగ్స్ ఖాతాలకు వర్తింపు
  • పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ. 50,000 తప్పనిసరి
  • పాత ఖాతాదారులకు యథాతథంగా కొనసాగనున్న నిబంధనలు
  • కనీస బ్యాలెన్స్ లేకపోతే రూ. 500 వరకు జరిమానా
దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్, తమ సేవింగ్స్ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. కొత్తగా ఖాతాలు తెరిచే కస్టమర్లకు కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) పరిమితిని భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో దేశంలోనే అత్యధిక కనీస బ్యాలెన్స్ అవసరాన్ని నిర్దేశించిన బ్యాంకుగా ఐసీఐసీఐ నిలిచింది.

బ్యాంకు వెబ్‍సైట్‍లో పొందుపరిచిన సమాచారం ప్రకారం, ఈ నెల 1 లేదా ఆ తర్వాత మెట్రో, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా సేవింగ్స్ ఖాతా తెరిచేవారు, ఇకపై నెలవారీ సగటుగా రూ. 50,000 బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ పరిమితి కేవలం రూ. 10,000గా ఉండేది. అయితే, పాత ఖాతాదారులకు మాత్రం రూ. 10,000 కనీస బ్యాలెన్స్ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని బ్యాంక్ స్పష్టం చేసింది.

పట్టణ ప్రాంతాలతో పాటు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని కొత్త ఖాతాదారులు రూ. 25,000, గ్రామీణ ప్రాంతాల్లోని వారు రూ. 10,000 కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. పాత కస్టమర్లకు ఈ పరిమితులు వరుసగా రూ. 5,000 గానే ఉంటాయి. నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ నిర్వహించడంలో విఫలమైతే, బ్యాలెన్స్‌లో ఉన్న లోటుపై 6 శాతం లేదా రూ. 500, ఏది తక్కువైతే అది జరిమానాగా విధిస్తారు.

కనీస బ్యాలెన్స్ పెంపుతో పాటు, నగదు లావాదేవీల నిబంధనలను కూడా బ్యాంక్ సవరించింది. నెలకు మూడుసార్లు ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ. 150 చార్జీ చెల్లించాలి. అదేవిధంగా, ఉచిత నగదు విత్ డ్రాయల్స్ సంఖ్యను కూడా మూడుకే పరిమితం చేశారు.

దేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ) 2020లోనే కనీస బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేసిన నేపథ్యంలో, ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చాలా వరకు ఇతర బ్యాంకులు రూ. 2,000 నుంచి రూ. 10,000 మధ్య కనీస బ్యాలెన్స్ కొనసాగిస్తుండగా, ఐసీఐసీఐ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించి, రూ. 50 లక్షల లోపు డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీని అందిస్తోంది.
ICICI Bank
ICICI Bank minimum balance
savings account
minimum average balance
MAB
banking news
finance
State Bank of India
SBI
banking charges

More Telugu News