: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

  • ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ 
  • కరీంనగర్‌లో ఘటన
  • పీజీ ప్రవేశ పరీక్ష రాసి ఇంటికి వెళుతుండగా ప్రమాదం  
కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాదకర ఘటన కరీంనగర్‌లో జరిగింది. వివాహం అయిన మూడో రోజే భర్త కళ్లెదుటే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళితే .. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల (22)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామానికి చెందిన చిరుత రాజుతో ఈ నెల 6వ తేదీ వివాహం జరిగింది. ఇటీవల అఖిల డిగ్రీ పూర్తి చేయగా పీజీ చేయాలని నిర్ణయించుకుంది. వివాహం అయిన తర్వాత కూడా ఆమె ఉన్నత చదువులకు భర్త అంగీకరించాడు. 

ఈ క్రమంలో నిన్న తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని కళాశాలలో పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు భర్త రాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. పరీక్ష ముగిసిన తర్వాత ద్విచక్ర వాహనంపై వీరు తిరుగు ప్రయాణం కాగా, కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ కాలనీ వద్ద హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కిందపడిపోగా, అఖిల తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. 

మూడు రోజుల క్రితమే తన జీవితంలోకి వచ్చిన భార్య కళ్లెదుటే మృతి చెందడంతో రాజు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరుల హృదయాలను కలచివేసింది. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదచ్ఛాయలు అలముకున్నారు.    

More Telugu News