40 ఏళ్లు పైబడిన ప్రతీ ఐదుగురిలో ఒకరికి మధుమేహం.. లాన్సెట్ నివేదిక

  • 40 శాతం మందికి తాము బాధితులమనే విషయం తెలియదని వెల్లడి
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధుమేహ బాధితులు ప్రతీ ఏడుగురిలో ఒకరు భారత్ లోనే..
  • మధుమేహంపై భారతీయుల్లో అవగాహన పెంచాలంటున్న నివేదిక
భారతీయుల్లో మధుమేహంపై అవగాహన కాస్త తక్కువేనని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. చాలామందికి తాము మధుమేహంతో బాధపడుతున్న విషయం తెలియదని, ఫలితంగా జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలిపింది. 2019లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం.. 40 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఐదుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఇందులో 40 శాతం మందికి తాము మధుమేహంతో బాధపడుతున్నట్లు అసలు తెలియకపోవడం విచారకరమని తెలిపింది.

ఆరోగ్య స్పృహతో ముందుజాగ్రత్త చర్యగా బ్లడ్ షుగర్ స్థాయులను తరచూ పరీక్షించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, మధుమేహం బారిన పడిన విషయం తెలిసి జాగ్రత్తలు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా తక్కువేనని, కేవలం 46 శాతం మంది తమ బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారని తెలిపింది. ఆహారంలో మార్పులు, జాగ్రత్తల ద్వారా వారు మధుమేహాన్ని నియంత్రించుకుంటున్నారని వివరించింది.

దాదాపు 60 శాతం మంది విజయవంతంగా బ్లడ్ షుగర్ స్థాయులను తగ్గించుకుని జీవక్రియకు సంబంధించిన వ్యాధుల ముప్పును దూరం పెట్టగలుగుతున్నారని లాన్సెట్ నివేదిక తెలిపింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధుమేహ బాధితులు ప్రతీ ఏడుగురిలో ఒకరు భారత్ లోనే ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది. మధుమేహ బాధితులలో పురుషులు 19.6 శాతం, మహిళలు 20.1 శాతం ఉన్నారని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. భారతీయుల్లో మధుమేహంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక తెలిపింది.


More Telugu News