ఉత్తర కాశీ ప్రమాదంలో ఇస్రో సాయం.. శాటిలైట్ చిత్రాలతో రెస్క్యూ

  • ధరాలీ గ్రామాన్ని ముంచెత్తిన వరద
  • రెస్క్యూ కార్యక్రమాల్లో ఉపయోగకరంగా శాటిలైట్ చిత్రాలు
  • ఇస్రో సహకారంతో వేగంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తర కాశీ జిల్లాలోని ధరాలీ గ్రామాన్ని ఇటీవల వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. ఖీర్ గడ్, భాగీరధీ నదులు ఉప్పొంగడంతో వరద నీరు ఒక్కసారిగా గ్రామాన్ని ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల్లోని ధరాలీ గ్రామం బురదలో కూరుకుపోయింది. వరదలో కొన్ని ఇండ్లు కొట్టుకుపోగా మరికొన్నింటిని బురద ముంచెత్తింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లు ప్రకటించిన అధికారులు వంద మందికి పైగా గల్లంతయ్యారని వెల్లడించారు.

ఈ క్రమంలో గల్లంతైన వారిని గుర్తించేందుకు రెస్క్యూ కొనసాగుతోంది. రెస్క్యూ పనుల్లో అధికారులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారం తీసుకుంటున్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా గతంలో గ్రామంలోని భవనాలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతూ గాలిస్తున్నారు. బురదలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ కు అవసరమైన అత్యాధునిక పరికరాలను యుద్ధప్రాతిపదికన విమానాల్లో ధరాలీ గ్రామానికి తరలిస్తున్నట్టు వివరించారు. గంగోత్రికి వెళ్లే యాత్రికులు మార్గమధ్యంలో ధరాలీ గ్రామంలో ఆగుతుండడం రివాజు. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడడం, వరదల కారణంగా పలు రోడ్లు మూతపడి పలువురు యాత్రికులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా తరలించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.



More Telugu News