'కాంతార: చాప్టర్ 1' నుంచి క్రేజీ అప్‌డేట్.. 'కనకవతి'గా రుక్మిణి వసంత్.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'కాంతార: చాప్టర్ 1'
  • ప్రమోషన్లు ప్రారంభించిన చిత్రబృందం
  • కనకవతి పాత్రలో హీరోయిన్ రుక్మిణి వసంత్ పరిచయం
  • అతీత శక్తులున్న నాగ సాధువుగా రిషభ్ శెట్టి
  • ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు మూవీ
2022లో విడుద‌లై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార: చాప్టర్ 1' సినిమా ప్రమోషన్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టే, చిత్రబృందం ఒక కీలక అప్‌డేట్‌తో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కథానాయిక పాత్రను, ఆమె పేరును ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఈ చిత్రంలో 'కనకవతి' అనే కీలక పాత్రలో ప్రముఖ నటి రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. 'కాంతార' కథకు ముందు ఏం జరిగిందనే అంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బనవాసిని పాలించిన కదంబుల సామ్రాజ్యం కాలం నాటి కథాంశంతో, ఆ కాలంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఇందులో చూపించనున్నారు. ముఖ్యంగా భూతకోల ఆచారం వెనుక ఉన్న పురాణగాథను ఈ ప్రీక్వెల్‌లో ఆవిష్కరించబోతున్నారు.

ఈ సినిమాలో రిషభ్ శెట్టి అతీతశక్తులు కలిగిన నాగ సాధువు పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇదివరకే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 'కాంతార'ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ పతాకంపైనే విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని కూడా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బి. అజ్నీశ్ లోకనాథ్ మరోసారి తన సంగీతంతో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


More Telugu News