హుమా ఖురేషీ కజిన్ హత్యకు ముందు ఏం జరిగింది?.. వీడియో ఇదిగో!

  • ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో గత రాత్రి ఘటన
  • హత్యకు దారితీసిన బైక్ పార్కింగ్ గొడవ
  • పదునైన ఆయుధాలతో దాడిచేసిన నిందితులు
  • సీసీటీవీల్లో రికార్డయిన ఘటన
బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ ఖురేషి (42) ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో గత రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం ఈ హత్యకు దారితీసినట్టు ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో నిందితులకు చెందిన ఒక స్కూటర్‌ను ఆసిఫ్ ఖురేషి ఇంటి గేటు ముందు పార్క్ చేశారు. బైక్ తీయమని ఆసిఫ్ కోరడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ఘర్షణకు దారితీసిందని, నిందితులు పదునైన ఆయుధాలతో ఆసిఫ్‌పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఆసిఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది. ఫుటేజ్‌లో పలువురు చూస్తుండగానే దుండగులు ఆసిఫ్‌పై దాడి చేయడం కనిపిస్తోంది. గొడవ ఆపడానికి కొందరు ప్రయత్నించినా, నిందితులు ఆసిఫ్‌పై దాడి చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందని, మళ్లీ ఇప్పుడు ఇలా జరిగిందని ఆసిఫ్ భార్య పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


More Telugu News