గంజాయి తాగుతూ దొరికిన హైదరాబాద్ మెడికల్ కాలేజీ విద్యార్థులు

  • గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్
  • 82 మంది గంజాయి వినియోగదారుల్లో 32 మంది విద్యార్థులు
  • డ్రగ్ టెస్టులో ఇద్దరు అమ్మాయిలు సహా 9 మందికి పాజిటివ్
  • లక్షన్నర విలువైన ఆరు కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ మెడికల్ కాలేజీలో 32 మంది విద్యార్థులు గంజాయి తాగినట్టు తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) అధికారులు గుర్తించారు. గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరిని అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 మొత్తం 82 మంది గంజాయి వినియోగదారులను గుర్తించగా, వారిలో మెడిసిటీ మెడికల్ కాలేజీకి చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ఇద్దరు అమ్మాయిలు సహా తొమ్మిది మందికి పాజిటివ్ అని తేలింది. వీరంతా కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్నారు.

 ఈగల్ అధికారులు కళాశాల యాజమాన్యంతో కలిసి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన తొమ్మిది మందిని డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించారు. రాబోయే 30 రోజులు వారి రికవరీకి చాలా కీలకమని అధికారులు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం కళాశాలల్లో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని యాంటీ-డ్రగ్ ఏజెన్సీ ప్రకటించింది.

ఈ కేసులో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ఆఫత్ అహ్మద్ ఖాన్ (23), జరీనా బాను (46) అనే ఇద్దరిని ఈగల్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.50 లక్షల విలువైన ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 అర్ఫాత్ అహ్మద్ ఖాన్ గంజాయికి బానిసై, తన అలవాటు కోసం డ్రగ్స్ అమ్మకాలు ప్రారంభించాడు. జరీనా బానుతో కలిసి హైదరాబాద్‌లో గంజాయి సరఫరా చేసేవాడు. గతంలో కూడా అతడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. జరీనా బాను 2010 నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాలో పాలుపంచుకుంటోందని పోలీసులు తెలిపారు. ఈమెపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. ఈమె బ్యాంకు ఖాతాలో రూ.1.5 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇందులో రూ.26 లక్షలు హైదరాబాద్‌లోని 51 మంది పెడ్లర్ల నుంచి వచ్చాయి. ఈమె మహారాష్ట్ర, కర్ణాటకలోని బీదర్ ప్రాంతాల నుంచి గంజాయి తెస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.  


More Telugu News