హైదరాబాద్‌లో రికార్డు స్థాయి వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం!

  • హైదరాబాద్‌ను ముంచెత్తిన ఆకస్మిక, భారీ వర్షం
  • కుత్బుల్లాపూర్‌లో రికార్డు స్థాయిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • నగరంలో ఎక్కడికక్కడ నిలిచిన నీరు, స్తంభించిన జనజీవనం
  • అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • సహాయక చర్యల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
భాగ్యనగరాన్ని గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా ఏకధాటిగా కురిసిన కుండపోత వానతో నగరం అతలాకుతలమైంది. కేవలం కొన్ని గంటల్లోనే రోడ్లన్నీ జలమయమై నదులను తలపించాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయి, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు.

నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో 15 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా శేరిలింగంపల్లిలో 14 సెం.మీ., సరూర్‌నగర్‌లో 12.8 సెం.మీ., ఖైరతాబాద్‌లో 12.6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శ్రీనగర్ కాలనీలో ఓ ద్విచక్ర వాహనదారుడు వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న దృశ్యం భయాందోళనలు కలిగించింది. లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, రాజ్‌భవన్ రోడ్డుతో పాటు ఐటీ కారిడార్లయిన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, హైడ్రా (HYDRA) విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం ఆయా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లను ప్రకటించారు. 

మరోవైపు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 15 సెం.మీ., నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే..
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు- 87126 60600
సైబరాబాద్‌ కమిషరేట్‌- 85004 11111
రాచకొండ కమిషనరేట్‌- 87126 62999
హైడ్రా- 91541 70992
జీహెచ్‌ఎంసీ- 81259 71221
జలమండలి- 99499 30003
టీజీఎస్‌పీడీసీఎల్‌- 79015 30966
ఎన్డీఆర్‌ఎఫ్‌- 83330 68536
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)- 87125 96106


More Telugu News