Revanth Reddy: కేసీఆర్‌ని అరెస్ట్ చేయాల్సిన పనిలేదు.. ఎర్రవల్లి ఫామ్‌హౌసే చర్లపల్లి జైలుతో సమానం: రేవంత్‌రెడ్డి

Revanth Reddy says KCR Erravalli Farmhouse is equal to Cherlapally Jail
  • కేసీఆర్‌ను ఓడించడమే ఆయనకు అతిపెద్ద శిక్ష అన్న రేవంత్‌రెడ్డి
  • విద్వేష రాజకీయాలు తనకు ఇష్టం ఉండదని స్పష్టీకరణ
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందన్న సీఎం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారంతో పోల్చారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి ఆ విధంగా స్పందించారు. 

"జైలులో ఖైదీలను పోలీసులు ఎలా పర్యవేక్షిస్తారో, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూడా అదేవిధంగా పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. జైలులో ఖైదీలను కలవడానికి సందర్శకులు ఎలా వస్తారో, అప్పుడప్పుడు రాజకీయ నాయకులు కూడా ఆయన్ను కలవడానికి ఫామ్‌హౌస్‌కు వెళ్తుంటారు" అని రేవంత్‌రెడ్డి అన్నారు.

విద్వేష రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఓడించడమే ఆయనకు అతిపెద్ద శిక్ష అని అన్నారు. "మేము దుప్పటి కప్పుకొని నిద్రపోయినా ప్రజలే మమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తారు" అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరుగుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ కాగానే బీఆర్ఎస్ నాయకులు నైతిక విజయం సాధించామని ప్రకటనలు చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు నైతిక విజయం గురించి మాట్లాడటం.. నైతికతను ఆత్మహత్య చేసుకునేలా చేస్తుందని ఎద్దేవా చేశారు.
Revanth Reddy
KCR
KC Rao
Telangana
Errvalli Farmhouse
Charllapalli Jail
BRS
Jubilee Hills
Telangana Politics
Revanth Reddy Comments

More Telugu News