Chandrababu Naidu: నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces Pension at 50 for Weavers
  • మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 
  • చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని ప్రకటన
  • రాజధాని అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటుకు హామీ
  • మరమగ్గాలకు సబ్సిడీలు, ఉచిత విద్యుత్ యూనిట్ల పెంపు
  • ప్రభుత్వ నిర్ణయాలతో 93 వేల కుటుంబాలకు ప్రయోజనం
చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ, వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు. నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారినపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో చేనేత వస్త్ర వైభవాన్ని చాటిచెప్పేలా ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. గతంలో 55,500 మంది కార్మికులకు రూ. 27 కోట్ల రుణాలు అందించామని, 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు.

ఈ మద్దతును మరింత విస్తరిస్తూ మరమగ్గాల కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు కేటాయిస్తున్నామని, వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో దీనిని 500 యూనిట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, సవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Handloom Weavers
Pension Scheme
Mangalagiri
National Handloom Day
Free Electricity
Power Looms
Nara Lokesh

More Telugu News